బాలిక గర్భవతిగా వస్తే పోలీసులకు చెప్పాల్సిందే.. ఆస్పత్రులకు ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

బాలిక గర్భవతిగా వస్తే పోలీసులకు చెప్పాల్సిందే.. ఆస్పత్రులకు ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: 18 సంవత్సరాల్లోపు బాలికలు గర్భంతో ఆస్పత్రులకు వస్తే కచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందేనని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రైవేట్ ఆస్పత్రులకు అక్కడి ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఆదేశాలను పాటించని వైద్యులు, ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సమాచారం ఇవ్వడంలో విఫలమైన సంస్థ బాధ్యులకు ఏడాది వరకూ జైలుశిక్ష, జరిమానా కూడా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

పోక్సో చట్టం 2012 ప్రకారం.. 18 ఏళ్ల లోపు బాలిక గర్భవతి అవ్వడం తీవ్రమైన నేరమని, దానిపై కచ్చితంగా సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) ప్రకారం నేరం జరిగినట్లు తెలిసినా, జరగబోతోందని అనుమానం వచ్చినా ఆ సమాచారాన్ని స్పెషల్ జువైనల్‍పోలీస్ యూనిట్ లేదా స్థానిక పోలీసులకు అందించాలన్నారు. బాధితురాలి డీటెయిల్స్ ను బయటకు చెప్పకుండా అధికారులకు సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి కూడా పోక్సో చట్టంపై అవగాహన కల్పించాలని సూచించింది.

Next Story