రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు భేటీ

by Naga Rani Yarlagadda |

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో భేటీ అయ్యారు.

రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీలో విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంపై కీలకంగా చర్చించినట్లు ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం, శ్రీకాకుళం నుంచి సికింద్రాబాద్, తిరుపతి నగరాలకు డైరెక్ట్ రైళ్లను నడపడంపై చర్చించినట్లు తెలిపారు. అలాగే ధోలేరా అంతర్జాతీయ విమానాశ్రయం పురోగతి పై కూడా అశ్వినీ వైష్ణవ్ తో చర్చించామని పేర్కొన్నారు. మందస రోడ్, పాతపట్నం, హరిశ్చంద్రపురం స్టేషన్లలో కీలక రైలు నిలుపుదలలు, కామేశ్వరీపేట హాల్ట్ స్టేషన్ అభివృద్ధి, ఎన్‌హెచ్-16 పక్కన ఉన్న హరిశ్చంద్రపురం స్టేషన్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా అప్‌గ్రేడ్ చేయడం వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించామని, కొత్త ROBలు/RUBలు, స్టేషన్ లలో ప్రయాణికుల సౌకర్యాలపై కూడా ప్రతిపాదనలు అందించామని వెల్లడించారు. మంత్రితో కలసి కంట్రోల్ రూమ్ లో పనితీరును సమీక్షిస్తూ, ప్రయాణికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నట్లు రామ్మోహన్ తెలిపారు. ధోలేరా అభివృద్ధికి అనుగుణంగా రైల్వే మౌలిక వసతులను సమన్వయం చేస్తూ, భవిష్యత్ విస్తరణకు అనుకూలంగా ఎయిర్–రైల్ కనెక్టివిటీపై కూడా చర్చించామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, సమగ్ర మల్టీ-మోడల్ కనెక్టివిటీ ద్వారా దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి తామెప్పుడూ కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

Next Story