Odisha : ఒడిశా తీరంలో లక్షలాది తాబేళ్లు !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-20 13:35:54  IST  )

ఒడిశా సముద్ర తీరంలో ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమవుతోంది. దాదాపు 3 లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు(Olive Ridley turtles) తమ వార్షిక సామూహిక గూడు కోసం వచ్చాయి.

Odisha : ఒడిశా తీరంలో లక్షలాది తాబేళ్లు !
X

దిశ, వెబ్ డెస్క్ : ఒడిశా సముద్ర తీరంలో ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమవుతోంది. దాదాపు 3 లక్షల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు(Olive Ridley turtles) తమ వార్షిక సంతానోత్పత్తి(Fertility) కోసం బీచ్ కు తరలివచ్చాయి. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఏటా బీచ్ కు రావడాన్ని అరిబాడా అని పిలుస్తారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని గహిర్మత బీచ్, రుషికుల్య తాబేళ్ల సంరక్షణ తీర ప్రాంతాలకు ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి వస్తుంటాయి. భారత దేశంలో అత్యధికంగా ఒడిశా తీరంలో ఈ రకం తాబేళ్లను చూడవచ్చు.

ఒడిశా తీర ప్రాంతానికి పర్యాటకపరమైన గుర్తింపుతో పాటు ఏటా వచ్చే ఆలివ్ రిడ్లే తాబేళ్ల రాకతో పర్యావరణ పరిరక్షణ పరంగానూ మంచి పేరుంది. ఇక్కడి బీచ్ లకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. ఇక్కడి సహజసిద్ధమైన బీచ్ లు ఇసుక తిన్నెలు ఆ తాబేళ్ల పునరుత్పత్తికి ఎంతో అనువుగా ఉంటాయి. ఈ తాబేళ్లు సముద్ర పర్యావరణ వ్యవస్థను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి సంవత్సరం ఒడిశా తీరానికి అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టి వెళుతుంటాయి.

తరువాత ఈ గుడ్లలో నుండి తాబేలు పిల్లలు బయటకు వచ్చి బుడిబుడి అడుగులు వేసుకుంటూ సముద్రంలోకి జారుకుంటాయి. ఈ దృశ్యాలు ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్లు తీరం వెంబడి దాదాపుగా 30 కిలోమీటర్ల లోపలవరకు జీవనం సాగిస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి సమయాల్లో.. సముద్ర తీరాల్లో గుడ్లు పెట్టి వాటిని ఒడ్డునే గుడ్లు పొదిగి తర్వాత సముద్రంలోకి వెళుతూ ఉంటాయి. ఇవి గుడ్లు పొదిగే సీజన్ కావడంతో తీరానికి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నాటికల్ మైళ్ళ దూరంలోనే ఇవి జీవనం సాగిస్తూ ఉంటాయి. ఇవి ఉభయచర జీవులు. ఒక ఆలివ్ రిడ్లే తాబేలు సగటున ఒక సీజన్ లో 40 నుంచి 50 గుడ్లు పెడుతుందని అంచనా.

అందులో దాదాపుగా 30కి పైగా మాత్రమే జీవిస్తాయి. కొన్ని తీరంలోనే చనిపోతాయి. కొన్ని సముద్రంలోకి వెళ్లి చేపలకు ఆహారంగా మారుతుంటాయి. మొత్తం మీద ఒక తాబేలు 40 గుడ్లు పొదిగితే అందులో 30 వరకు బ్రతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారు నిపుణులు. అద్భుతమైన జీవ వైవిధ్య ప్రక్రియకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు నిదర్శనంగా చెప్పవచ్చు. వీటికి కూడా ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించే శక్తి ఉంటుందని నిపుణుల కథనం.

Next Story