బెంగళూరులో అర్ధరాత్రి హైడ్రామా: కేరళ యువకుడిపై యువతుల దాడి.. పోలీసుల ముందే వీరంగం!

by Ramesh Naini |

బెంగళూరులోని రద్దీ ప్రాంతమైన కోరమంగళలో అర్ధరాత్రి సమయంలో భారీ హైడ్రామా చోటు చేసుకుంది.

బెంగళూరులో అర్ధరాత్రి హైడ్రామా: కేరళ యువకుడిపై యువతుల దాడి.. పోలీసుల ముందే వీరంగం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులోని రద్దీ ప్రాంతమైన కోరమంగళలో అర్ధరాత్రి సమయంలో భారీ హైడ్రామా చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువత నడిరోడ్డుపైనే దారుణంగా కొట్లాటకు దిగారు. రాత్రి 1:35 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికులను, అటుగా వెళ్లే ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ఘర్షణకు పాల్పడిన వారిలో నేపాల్, కేరళ రాష్ట్రానికి చెందిన యువతీ యువకులు ఉన్నారు. వీరంతా కలిసి మద్యం సేవించినట్లు తెలుస్తోంది. మొదట వీరి మధ్య చిన్న వాగ్వాదంగా మొదలైన గొడవ.. క్షణాల్లోనే పెద్ద ఘర్షణకు దారితీసి, ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరింది.

రోడ్డుపైనే యువతి హల్‌చల్..

ఈ గొడవలో ఓ నేపాలీ యువతి రెచ్చిపోయింది. కేరళకు చెందిన ఓ యువకుడితో వాగ్వాదానికి దిగిన ఆమె.. అందరూ చూస్తుండగానే అతని చెంప చెల్లుమనిపించింది. అంతటితో ఆగకుండా కోపంతో అతని చేయి పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్తూ నానా యాగీ చేసింది. ఇదంతా అక్కడున్న వారు చూసి అవాక్కయ్యారు.

పోలీసులు ఉన్నా ఆగని రచ్చ..

ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే, మద్యం మత్తులో ఉన్న ఆ యువతీ యువకులు పోలీసులను సైతం లెక్కచేయలేదు. ఖాకీల ముందే ఒకరినొకరు నెట్టుకుంటూ, కేకలు వేసుకుంటూ రోడ్డుపై నానా రచ్చ చేశారు. వీరు సృష్టించిన గందరగోళంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story