తమిళనాడు, బెంగాల్‌లో మైకులు బంద్.. ముగిసిన ఎన్నికల ప్రచారం

by Ramesh Naini |   (  Updated:2026-04-21 13:07:34  IST  )

ఎలక్షన్ ఫీవర్‌తో హోరెత్తిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది.

తమిళనాడు, బెంగాల్‌లో మైకులు బంద్.. ముగిసిన ఎన్నికల ప్రచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎలక్షన్ ఫీవర్‌తో హోరెత్తిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. గురువారం (ఎల్లుండి) ఇరు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా, బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలకు గానూ రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. అందులో భాగంగా తొలివిడతలో 152 స్థానాలకు గురువారం ఓటింగ్ జరగనుంది. (రెండో విడత ఏప్రిల్ 29న, ఫలితాలు మే 4న వెల్లడికానున్నాయి).

అమల్లోకి సైలెన్స్ పీరియడ్.. ‘డ్రై డే’ ప్రకటన

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 నిబంధనల ప్రకారం.. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ప్రచార నిషేధం (సైలెన్స్ పీరియడ్) అమలులోకి వచ్చింది. ఇకపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం, టీవీల ద్వారా ప్రచారం చేయడం, ఓటర్లను ఆకర్షించేలా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం. ఎన్నికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో పోలింగ్‌కు ముందు 48 గంటల పాటు, అలాగే ఓట్ల లెక్కింపు రోజైన మే 4న ‘డ్రై డే’ (మద్యం విక్రయాలు బంద్) అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ప్రలోభాలకు చెక్.. పారదర్శకంగా ఎన్నికలు

బెంగాల్‌లో స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించే ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయాలకు తావులేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

చివరి నిమిషం వరకు సుడిగాలి పర్యటనలు

ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో చివరి రెండు రోజులు అగ్రనేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర యత్నాలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ తరఫున జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్.. టీఎంసీ తరఫున సీఎం మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ.. కాంగ్రెస్ తరఫున మల్లికార్జున ఖర్గే సుడిగాలి పర్యటనలు చేశారు. మరోవైపు, సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన తమిళనాడులోనూ రాజకీయ వేడి రగులుకుంది. అధికార డీఎంకే హయాంలో కుటుంబ పాలన గ్రామ స్థాయికి చేరిందని బీజేపీ విమర్శించగా.. శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరిగాయని అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఆరోపించారు. అయితే, ఆప్ అధినేత కేజ్రీవాల్ మాత్రం డీఎంకే పాలనను సమర్థించారు. కేంద్ర సంస్థలను వాడుకుంటూ బీజేపీ వేధింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా సాగిన ప్రచారానికి తెరపడటంతో, ఇప్పుడు అందరి దృష్టీ ఎల్లుండి జరగబోయే పోలింగ్ పైనే నెలకొంది. బహుముఖ పోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉండబోతోందో మే 4న తేలనుంది.

తమిళనాడు ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. డీఎంకే కూటమికి ఎంఐఎం మద్దతు

Next Story