Microfinance: మైక్రోఫైనాన్స్ కంపెనీల వేధింపులు.. కర్ణాటకలో వ్యక్తి ఆత్మహత్య

by B.Srinivas |   (  Updated:2025-02-03 19:04:44  IST  )

మైక్రోఫైనాన్స్ కంపెనీల వేధింపుల కారణంగా కర్ణాటకలోని హవేరిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Microfinance: మైక్రోఫైనాన్స్ కంపెనీల వేధింపులు.. కర్ణాటకలో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, నేషనల్ బ్యూరో: మైక్రోఫైనాన్స్ (Micro finance) కంపెనీల వేధింపుల కారణంగా కర్ణాటకలోని హవేరిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన రాణే బెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాలతేష్ (42) అనే వ్యక్తి బార్బర్ షాప్ నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు మైక్రోఫైనాన్స్ కంపెనీల నుంచి ఏకంగా రూ.6.45 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వాయిదా పద్దతిలో తిరిగి డబ్బులు చెల్లించినప్పటికీ మైక్రోఫైనాన్స్ కంపెనీలు వేధింపులకు గురిచేశాయని కుటుంబీలు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన మాలతేష్ ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మైక్రోఫైనాన్స్ కంపెనీలపై బీఎన్ఎస్ సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపడతామని తెలిపారు.

ఈ ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Shiva kumar) స్పందించారు. రుణ రికవరీ పేరుతో మైక్రోఫైనాన్స్ కంపెనీలు పేదలను హింసించడాన్ని ఆపడానికి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను రూపొందించిందని తెలిపారు. మైక్రోఫైనాన్స్ కంపెనీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గూండాలను ఉపయోగించి పేదలను చిత్రహింసలకు గురిచేయడాన్ని ప్రభుత్వం అనుమతించబోదని, వీటిని అరికట్టేందుకు పోలీసులకు మరిన్ని అధికారాలు కల్పిస్తామన్నారు. బెలగావి, బీదర్, మైసూరు, రామనగరలో కంపెనీలపై చాలా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని, ఈ విషయంలో సీఎం, సహకార మంత్రులు ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు చేశారని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను త్వరలోనే గవర్నర్ కు పంపిస్తామన్నారు.

Next Story