వాహనాలపై మీడియా స్టిక్కర్లు.. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2026-03-21 09:31:56  IST  )

నిందితుల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాపై హాట్ కామెంట్స్ చేసింది.

వాహనాలపై మీడియా స్టిక్కర్లు.. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిందితుల ఫోటోలు, వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు పారదర్శక దర్యాప్తునకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న అభిప్రాయపడింది. కేసుకు సంబంధించి నిందితుల ఫోటోలు, వీడియోలను పోలీసులు సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హేమేంద్ర పటేల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ (PIL) దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్ బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పాంచోలిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. నిందితులను మోకాళ్లపై కూర్చోబెట్టడం, తాళ్లతో కట్టడం, ఊరేగించడం వంటి దృశ్యాలను పోలీసులు సోషల్ మీడియాలో పెడుతున్నారని, దీనివల్ల ప్రజల్లో నిందితులపై ముందే ఒక వ్యతిరేక భావన (Bias) ఏర్పడుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు.

ప్రతిఒక్కరూ మీడియాగా మారిపోతున్నారు:

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మీడియాగా మారిపోతున్న ఈ కాలంలో ఇలాంటి చర్యలు నిందితులకు దక్కాల్సిన 'న్యాయమైన విచారణ' (Fair Trial) హక్కుకు విఘాతం కలిగిస్తాయని ధర్మాసనం పేర్కొంది. టీవీ ఛానెళ్ల కంటే సోషల్ మీడియాలో నియంత్రణ తక్కువగా ఉంది అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలు బాధితులకు కానీ, నిందితులకు కానీ అనుకూలంగా ఉండకూడదని, నిజానిజాలను వెలికితీయడమే వారి పని అని కోర్టు గుర్తు చేసింది. మీడియా సమావేశాల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విచారణను ప్రభావితం చేయకూడదని పేర్కొంది.

వాహనాలపై మీడియా స్టిక్కర్లు డిజిటల్ అరెస్టు లాంటిదే:

పట్టణాల్లో చాలామంది తమ వాహనాలపై మీడియా అని స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారని, విడివిడిగా ఉన్న సోషల్ మీడియానే ఇక్కడ సమస్య అని జస్టిస్ బాగ్చి అన్నారు. దాంతో ఇది ఒక రకమైన 'డిజిటల్ అరెస్ట్' లాంటిదని సీజేఐ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసమే నడుస్తున్నాయని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసుల మీడియా బ్రీఫింగ్‌లకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించడానికి ఇప్పటికే రాష్ట్రాలకు మూడు నెలల గడువు ఇచ్చామని కోర్టు తెలిపింది. ఈ అంశంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని భావించిన ధర్మాసనం, ఏప్రిల్ తర్వాత సమగ్రమైన వివరాలతో మళ్లీ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Next Story