- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు కేవలం భాషే కాదు.. ఒక సంప్రదాయం: మారిషస్ అధ్యక్షుడు
తెలుగు కేవలం భాషే కాదు.. ఒక సంప్రదాయం అని మారిషస్ అధ్యక్షుడు కొనియాడారు.

దిశ, నేషనల్ బ్యూరో: తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది ఆధ్యాత్మిక వారసత్వంతో ముడిపడి జీవించి ఉన్న సంప్రదాయమని మారిషస్ ప్రెసిడెంట్ ధరమ్ గోఖూల్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగిన మూడో ప్రపంచ తెలుగు కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలోని తెలుగు వారందర్నీ ఈ వేదిక ఏకం చేస్తోందని ఆయన మెచ్చుకున్నారు. ‘తెలుగు జస్ట్ ఒక భాష కాదు. ఒక సజీవ సంప్రదాయం, అద్భుతమైన ఆధ్యాత్మిక వారసత్వానికి తెలుగు ప్రతీక’ అని ధరమ్ గోఖూల్ అన్నారు. కొత్త ఏడాది ప్రారంభమైన సందర్భంగా.. మారిషస్‌లో కూడా జాతీయ సెలవుదినంగా జరుపుకునే ఉగాది పండుగను కూడా ఆయన గుర్తుచేశారు.
‘క్యాలెండర్లు వేరు కావొచ్చు. కానీ కొత్త ప్రారంభాలు, జ్ఞానం-దూరదృష్టితో వారసత్వాన్ని కాపాడాల్సిన మన బాధ్యతలు ఎక్కడకు వెళ్లినా ఒకటే’ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం 50 దేశాల్లో తెలుగు మాట్లాడుతున్నారని కొనియాడిన ఆయన.. ఆ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు స్వాగతం పలికారు. వివిధ సంప్రదాయాల కలయిక అయిన మారిషస్ సమాజంలో తెలుగు ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఈ క్రమంలోనే భారత్-మారిషస్ మధ్య అద్భుతమైన సంబంధాలు నెలకొన్నాయని గోఖూల్ తెలియజేశారు. మారిషస్ జాతి నిర్మాణంలో తెలుగు వారి కృషి ఉందని, అందుకే తమ దేశంలో స్కూళ్లలో ప్రాథమిక విద్య నుంచి టెర్టియరీ వరకు తెలుగును నేర్పిస్తున్నామని చెప్పారు.
అలాగే తదుపరి ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్‌లో జరుగుతాయని, తద్వారా తెలుగు భాష, సంప్రదాయాలకు మరింత ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు ఏపీతో సంప్రదాయ, సాంకేతిక, అకాడమిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేలా ఎంవోయూలపై సంతకాలు చేశామని ఆయన వెల్లడించారు. మారిషస్ తెలుగు మహాసభ, ఆంధ్ర తెలంగాణ తెలుగు అసోసియేషన్ తదితర సంస్థలు తెలుగు విద్య, సాహిత్యం, సంప్రదాయాలను తరాలుగా కాపాడుతున్నాయని మెచ్చుకున్నారు. ఆరు రోజుల పర్యటన కోసం జనవరి 3వ తేదీన భారత్‌కు వచ్చిన మారిషస్ అధ్యక్షుడు.. జనవరి 8 వరకు భారత్‌లో ఉంటారు.






