Mauritius: మారిషస్ ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

by B.Srinivas |

ప్రధాని మోడీ మారిషస్‌ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గూలంతో చర్చలు జరిపారు.

Mauritius: మారిషస్ ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) మారిషస్‌ (Maritius) పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన బుధవారం మారిషస్ పీఎం నవీన్ చంద్ర రామ్ గూలంతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా వాణిజ్యం, సముద్ర భద్రతతో సహా 8 ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేరకు ఇరు దేశాధినేతలు అగ్రిమెంట్స్‌పై సంతకాలు చేశారు. ఒప్పందాలలో ముఖ్యంగా క్రాస్ బార్డర్ లావా దేవీలకు జాతీయ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం, సముద్ర డేటాను పంచుకోవడం, మనీలాండరింగ్‌ను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా పని చేయడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్​ఎంఈ) రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడం వంటివి ఉన్నాయి.

భారత్‌కు మారిషస్ కీలక భాగస్వామి: మోడీ

రామ్‌గూలంతో చర్చల తర్వాత ప్రధాని మోడీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధిపై ప్రస్తావించారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి మహాసాగర్ పేరుతో కొత్త విజన్ ప్రకటించారు. ‘అభివృద్ధి కోసం వాణిజ్యం, స్థిరమైన వృద్ధి కోసం సామర్థ్య నిర్మాణం, భాగస్వామ్య భవిష్యత్తు కోసం పరస్పర భద్రతపై దృష్టిసారిస్తాం’ అని తెలిపారు. మారిషస్ భారత్‌కు కీలకమైన భాగస్వామి అని అభివర్ణించారు. భారత్-మారిషస్ భాగస్వామ్యానికి మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యం హోదా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రతలో పూర్తి సహకారాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

నేషనల్ డే వేడుకలకు హాజరు

అంతకుముందు ప్రధాని మోడీ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్‌లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్ సహాయం చేస్తుందని తెలిపారు. మోడీతో పాటు భారత నావికాదళ యుద్ధనౌక, వైమానిక దళానికి చెందిన ఆకాశ్ గంగా స్కైడైవింగ్ బృందంతో పాటు భారత సాయుధ దళాల బృందం కూడా ఈ వేడుకల్లో పాల్గొంది.

Next Story