- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెహ్రాన్ షాపింగ్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి, 36 మందికి గాయాలు
ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఓ షాపింగ్ సెంటర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఓ షాపింగ్ సెంటర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 36 మంది గాయపడ్డారు. పశ్చిమ టెహ్రాన్‌లోని అండిషే పట్టణంలో ఉన్న ‘అర్ఘవాన్ షాపింగ్ సెంటర్’లో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక బ్రాడ్‌కాస్టర్ ‘ఐఆర్ఐబీ’ (IRIB) వెల్లడించింది.
వేగంగా వ్యాపించిన మంటలు..
భవనం వెలుపల మండే స్వభావం ఉన్న క్లాడింగ్ (Cladding) సామగ్రిని వాడటంతోనే మంటలు శరవేగంగా వ్యాపించాయని స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపినట్లు ‘మిజాన్’ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఘటనా స్థలం నుంచి ఆకాశాన్నంటేలా దట్టమైన పొగలు వస్తున్న దృశ్యాలను ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. అక్కడి భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, రోడ్ల అమరిక (శాటిలైట్ చిత్రాలు, ఆర్కైవ్‌ల) ఆధారంగా రాయిటర్స్ (Reuters) వార్తా సంస్థ ఈ వీడియోల లొకేషన్‌ను ధృవీకరించింది. అయితే, మంటలు ఎలా చెలరేగాయన్న ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, దీనిపై అధికారులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రమాదానికి అమెరికాతో సంబంధం..?
సోమవారం అమెరికా, ఇరాన్ల మధ్య పరస్పర కాల్పులు జరిగి, ఇరు దేశాల మధ్య ఉన్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. అయినప్పటికీ, అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు, ఈ ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది కేవలం ప్రమాదమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. క్షతగాత్రులకు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.






