- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయిల్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. లోపల లక్ష లీటర్ల ఆయిల్ స్టాక్!
తమిళనాడులోని చెన్నై శివార్లలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మనాలి పరిధిలోని విచూర్, లక్ష్మీనగర్లో ఉన్న ప్రైవేటు ఆయిల్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని చెన్నై శివార్లలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మనాలి పరిధిలోని విచూర్, లక్ష్మీనగర్లో ఉన్న ప్రైవేటు ఆయిల్ గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గోడౌన్ లో భారీగా ఆయిల్ నిల్వలు ఉండటంతో క్షణాల వ్యవధిలోనే మంటలు మొత్తం వ్యాపించాయి. దీంతో విధుల్లో ఉన్న కార్మికులు పరుగులు తీశారు. సుమారు ఉదయం 11.30 గంటల నుంచి ఆయిల్ కంపెనీలో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఫలితంగా దట్టమైన పొగ ఆ ప్రాంతమంతటినీ కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆయిల్ గోడౌన్ కావడంతో మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు, పరిశ్రమలకు వ్యాపించే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న కాలనీల ప్రజలను, ఇతర కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ప్రమాదానికి గల కారణాలు?
ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా పొరపాటు వల్ల జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమయంలో గోడౌన్ లో లక్ష లీటర్లకు పైగా ఆయిల్ నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ టైంలో లోపల ఎంతమంది కార్మికులు ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రాణనష్టంపై ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే ఆస్తి నష్టం ఎంత అనేది అంచనా వేయగలమని పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






