CBSE వెబ్‌సైట్‌పై భారీ సైబర్ దాడి.. 2 నిమిషాల్లో ఏకంగా 15 లక్షల హిట్స్

by Kema Shiva Kumar |

సీబీఎస్‌ఈ (CBSE) రీవాల్యుయేషన్ పోర్టల్‌పై భారీ సైబర్ అటాక్ జరిగింది.

CBSE వెబ్‌సైట్‌పై భారీ సైబర్ దాడి.. 2 నిమిషాల్లో ఏకంగా 15 లక్షల హిట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) రీవాల్యుయేషన్ పోర్టల్‌పై హ్యాకర్లు మరోసారి ముకుమ్మడి దాడికి తెగబడ్డారు. కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 15 లక్షల సార్లు సైబర్ దాడి ప్రయత్నాలు జరిగాయి. అయితే, భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) సైబర్ సెక్యూరిటీ వింగ్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, ఈ భారీ సైబర్ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే, తాజాగా సీబీఎస్‌ఈ మార్కుల రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా బోర్డు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ లైవ్‌లోకి వచ్చిన కొద్దిసేపటికే వెబ్‌సైట్ సర్వర్లు ఒక్కసారిగా నెమ్మదించాయి. దీనికి సాంకేతిక లోపం కారణం కాదని, వెనుక భారీ సైబర్ దాడి జరుగుతోందని ఎన్‌ఐసీ (NIC) అధికారులు గుర్తించారు.

2 నిమిషాల్లో 15 లక్షల హిట్స్..

హ్యాకర్లు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌ను క్రాష్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా భారీ ట్రాఫిక్‌ను పంపే డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ (DDoS) తరహా దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కేవలం 120 సెకన్ల వ్యవధిలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏకంగా 15 లక్షల సార్లు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడానికి, సర్వర్‌ను స్తంభింపజేయడానికి ప్రయత్నించారు. సైబర్ దాడి తీవ్రతను గుర్తించిన వెంటనే NIC సెక్యూరిటీ బృందం రంగంలోకి దిగింది. అనుమానాస్పద ఐపీ (IP) అడ్రస్‌లను బ్లాక్ చేయడంతో పాటు ట్రాఫిక్‌ను దారి మళ్లించి పోర్టల్‌ను సురక్షితంగా కాపాడింది. ఈ దాడి వల్ల విద్యార్థుల డేటాకానీ, మార్కుల వివరాలు కానీ ఎక్కడా లీక్ కాలేదని, డేటా అంతా పూర్తిగా భద్రంగానే ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ సైబర్ దాడి కారణంగా కొద్దిసేపు విద్యార్థులు రీవాల్యుయేషన్ అప్లికేషన్లు సమర్పించడంలో కొంత ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం వెబ్‌సైట్ సాధారణ స్థితికి చేరుకుందని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీబీఎస్‌ఈ వర్గాలు వెల్లడించాయి.

Next Story