- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య కళాశాలల్లో భారీ అవినీతి.. 10 రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు
గత కొంత కాలంగా దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో (Medical Colleges) పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినీతి, అక్రమాల ఆరోపణలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం నాడు కీలక దర్యాప్తు చేపట్టింది. ఈడీ ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలతో సహా 10 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో మెరుపు సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది జూన్ 30న కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల కింద ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఈ కేసులో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అధికారులతో సహా పలువురు ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించారని సీబీఐ (CBI) తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. వైద్య కళాశాలల తనిఖీలకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని సదరు అధికారులు లంచం తీసుకుని ఆయా కళాశాలల కీలక అధికారులకు, దళారీలకు చేరవేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ రహస్య సమాచారం సహాయంతో కళాశాలల యాజమాన్యాలు తనిఖీకి ముందు అవసరమైన పారామితులను, మౌలిక వసతులను తారుమారు చేసి, అక్రమంగా అకడమిక్ కోర్సులను నిర్వహించడానికి అనుమతులు పొందాయని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
ఈ భారీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈడీ బృందాలు (ED teams) ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏడు వైద్య కళాశాలల ప్రాంగణాలలో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొనబడిన కొందరు ప్రైవేట్ వ్యక్తులు, దళారుల నివాసాలు కూడా ఈ సోదాలలో భాగంగా ఉన్నాయి. ఈ సోదాల ద్వారా పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు, మనీలాండరింగ్ కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు ఈడీ దర్యాప్తు తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.






