టేస్ట్‌ అట్లాస్ ర్యాంకింగ్స్‌లో భారతీయ వంటకాల హవా.. మన దోశకు అంతర్జాతీయ గుర్తింపు !

by Naga Rani Yarlagadda |

టేస్ట్‌ అట్లాస్ ర్యాంకింగ్స్‌లో భారతీయ వంటకాల హవా.. మన దోశకు అంతర్జాతీయ గుర్తింపు !
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ వంటకాల వైభవం మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. ప్రముఖ గ్లోబల్ ఫుడ్ మ్యాగజైన్ 'టేస్ట్‌అట్లాస్' (TasteAtlas) 2026 సంవత్సరానికి గాను విడుదల చేసిన 'ప్రపంచంలోని టాప్ 50 ప్యాన్‌కేక్స్' జాబితాలో మన దక్షిణ భారతీయ వంటకమైన 'దోశ' ఘన విజయం సాధించింది. విదేశీయులు తీయగా ఉండే ప్యాన్‌కేక్స్‌ను ఎక్కువగా ఇష్టపడినప్పటికీ, మన కరకరలాడే మసాలా దోశలు వారి టేస్ట్ బడ్స్ ను ఆకట్టుకుని టాప్-10లో చోటు సంపాదించుకోవడం విశేషం.

ఈ జాబితాలో మసాలా దోశ అద్భుతమైన రుచితో 6వ స్థానాన్ని కైవసం చేసుకుంది. మసాలా దోశలోని ఆలుగడ్డ మిశ్రమం, చట్నీ, సాంబార్ కలయిక అంతర్జాతీయ ఆహార ప్రియులను విశేషంగా అలరించింది. ఇక మనం నిత్యం తినే సాధారణ దోశ 15వ ర్యాంక్‌లో నిలవగా, పలుచగా కరకరలాడే పేపర్ దోశ 35వ స్థానాన్ని దక్కించుకుంది. ఇలా మూడు వేర్వేరు రకాల దోశలు ప్రపంచ అత్యుత్తమ జాబితాలో నిలవడం భారతీయ ఆహార సంస్కృతికి దక్కిన గౌరవమనే చెప్పాలి. సాధారణంగా పశ్చిమ దేశాల్లో ప్యాన్‌కేక్స్ అంటే పిండి, గుడ్లు, పాలు ఉపయోగించి తీపి సిరప్‌లతో చేస్తారు. కానీ బియ్యం, మినప్పప్పును నానబెట్టి, పిండి పట్టించి చేసే దోశలు పోషకవిలువలతో పాటు వైవిధ్యమైన రుచిని కలిగి ఉండటమే ఈ అంతర్జాతీయ గుర్తింపునకు ప్రధాన కారణమని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘనతతో మన దేశీ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెరగనుంది.

Next Story