- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్.. కుక్క అరుపుతో ఆగిన పెళ్లి : అసలేం జరిగిందంటే..
కుక్క అరుపుతో పెళ్లి ఆగిన వింత ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగుచూసింది. ఆ కుక్క అరవడం తమకు ఇబ్బందిగా ఉందని వరుడి బంధువులు దాడి చేయడంతో గొడవ మొదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా ఖాగా తహసీల్‌లో ఒక పెంపుడు కుక్క కారణంగా ఒక శుభకార్యం రణరంగంగా మారింది. ఉన్నది ఒకటే జిందగీ సినిమాలో కుక్క కారణంగా ఓ జంట పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు. సరిగ్గా ఈ జంట కూడా తమ పెళ్లిని కుక్క కారణంగా క్యాన్సిల్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. వధువు ఇంట్లోని కుక్క మొరగడంపై మొదలైన చిన్న వివాదం కాస్తా.. పెళ్లి ఆగిపోయే వరకు వెళ్లింది. ఈ ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, పెళ్లి వేడుక రద్దయ్యింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
గురువారం (ఫిబ్రవరి 19) రాత్రి జ్యువెలరీ వ్యాపారి సుమిత్ కేసర్వానికి (25), తను కేసర్వాని (19) అనే యువతికి వివాహం జరగాల్సి ఉంది. బంధుమిత్రుల కోలాహలం మధ్య పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే.. వివాహ వేదికకు కొద్ది దూరంలో కట్టేసి ఉన్న వధువు పెంపుడు కుక్క పదేపదే మొరగడం మొదలుపెట్టింది. కుక్క అరుపుల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని పెళ్లి కొడుకు తరఫు వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వరుడి తరపున వచ్చిన ఒక వ్యక్తి ఆ కుక్కను నిశ్శబ్దంగా ఉంచేందుకు దానిని కర్రతో కొట్టాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా క్షణాల్లో పెను ఘర్షణకు దారితీసింది.
ఒకరిపై ఒకరు కుర్చీలు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో వధువు కుటుంబానికి చెందిన రిషబ్ కేసర్వాని, శుభమ్ గుప్తా, సంగీతా దేవి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తి చేయి విరిగింది. అటు వరుడి తరపున వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. గొడవ పెరగడంతో పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ఇరువర్గాలు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఖాగా ఎస్ హెచ్ఓ (SHO) ఆర్కే పటేల్ మాట్లాడుతూ.. "పెంపుడు కుక్క విషయంలో జరిగిన గొడవ పెద్దదిగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఇరుపక్షాల నుంచి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం" అని తెలిపారు.






