- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లు? చట్ట సవరణకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం
దేశంలో అమ్మాయిల కనీస పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న సామాజిక పరిస్థితులు, మహిళల విద్య, ఉపాధి అవకాశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం (Govt. Of India) మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని అమ్మాయిల కనీస వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచే దిశగా ఆలోచన చేస్తున్నది. తాజా సర్వేల గణాంకాలు, రాబోయే జనగణన లెక్కల ఆధారంగా కేంద్రం మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే, శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే (SRS), నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) వెల్లడించిన తాజా నివేదికల ప్రకారం.. దేశంలో అమ్మాయిల సగటు పెళ్లి వయసు గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా పెరిగింది. గతంలో ఉన్న సగటు వివాహ వయసు 19.3 ఏళ్ల నుంచి ప్రస్తుతం 23.1 ఏళ్లకు పెరిగినట్లుగా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో (Urban Areas) అమ్మాయిల సగటు వివాహ వయసు 24.4 ఏళ్లుగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో (Rural Areas) ఇది 22.6 ఏళ్లుగా నమోదైంది.
ఉన్నత చదువులు, ఉద్యోగాల వైపు మొగ్గు..
అమ్మాయిల వివాహ వయసు చట్టబద్ధంగా 18 ఏళ్లు అయినా.. మారుతున్న కాలంతో పాటు అమ్మాయిలు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపుతూ పెళ్లి ఆలస్యంగా చేసుకుంటున్నట్లుగా నివేదికల్లో తేలిందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక అమ్మాయిల పెళ్లి వయసును పురుషులతో సమానంగా 21 ఏళ్లకు పెంచేందుకు 2021లో మోడీ సర్కార్ గతంలోనే ఓ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. అయితే, ఆ బిల్లు పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉండగానే 17వ లోక్‌సభ రద్దు కావడంతో అది అక్కడితో ఎండ్ అయింది. ఈ నేపథ్యంలో రాబోయే 2027 జనగణన ప్రక్రియ పూర్తయిన తర్వాత లభించే అధికారిక జనాభా గణాంకాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టి చట్టరూపం తీసుకురావాలని యోచిస్తోంది. మహిళల ఆరోగ్యం, పోషకాహార లోపాలను నివారించడం, లింగ సమానత్వాన్ని పెంపొందించడంలో తీసుకురాబోయే కొత్త చట్టం ఉపకరిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.






