Canada: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ

by Yella Dhawani Reddy |

తీవ్ర ప్రజా వ్యతిరేకతతో కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) ఈ జనవరిలో తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Canada: కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ
X

దిశ, వెబ్ డెస్క్: తీవ్ర ప్రజా వ్యతిరేకతతో కెనడా (Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) ఈ జనవరిలో తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లిబరల్‌ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో తాజాగా అధికార లిబరల్‌ పార్టీ నేతగా మార్క్‌ కార్నీ(Mark Carney) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్నీ కెనడా 24వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

కాగా, 59 ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లైంది. మొత్తం 150,000 పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కార్నేకు 131,674 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ 11,134, కరినా గౌల్డ్‌కు 4,785, ఫ్రాంక్‌ బేలిస్‌కు 4,038 ఓట్లు వచ్చాయి.

మార్క్‌ కార్నీ 1965లో ఫోర్ట్‌ స్మిత్‌లో జన్మించారు. హార్వర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్‌మన్‌ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేసిన ఆయన.. 2003లో బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా డిప్యూటీ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. 2004లో ఆ బాధ్యతల నుంచి వైదొలగి.. కెనడా ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. అనంతరం 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2013లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ గవర్నర్‌గా ఎన్నికైన కార్నీ.. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ సెంట్రల్‌ బ్యాంక్‌కు మొట్టమొదటి నాన్‌-బ్రిటిష్‌ గవర్నర్‌గా నిలిచారు. 2020లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ను వీడిన ఆయన.. ఐక్య రాజ్య సమితిలో ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు.

Next Story