మావోయిస్టుల నోట కాల్పుల విరమణ మాట.. పార్టీ అధికార ప్రతినిధి అభయ్ సెన్సేషనల్ ఆడియో (వైరల్)

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-17 18:07:52  IST  )

దేశంలో మావోయిస్టుల తాజాగా కాల్పు విరమణ ప్రతిపాదన అందరి దృష్టి ఆకర్షిస్తోంది.

మావోయిస్టుల నోట కాల్పుల విరమణ మాట.. పార్టీ అధికార ప్రతినిధి అభయ్ సెన్సేషనల్ ఆడియో (వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మావోయిస్టుల తాజాగా కాల్పు విరమణ ప్రతిపాదన అందరి దృష్టి ఆకర్షిస్తోంది. తమ సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, కేంద్ర ప్రభుత్వంతో ఒక నెల రోజులు కాల్పుల విరమణ చేపట్టి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లుగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరు మీద విడుదలైన లేఖ విడుదలైంది. ‘ఆపరేషన్ కగార్’ ఉధృతంగా కొనసాగుతోన్న వేళ మావోయిస్టుల పేరిటి విడుదలైన లేఖ అసలైందా.. లేక ఎవరైనా కావాలనే ఫేక్ లేటర్‌‌ను విడుదల చేశారా అని సందేహం మెదలుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట బయటకు వచ్చిన ఓ ఆడియో సంచలనం సృష్టిస్తోంది. ఆ ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తి తనకు తాను అభయ్‌గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం ఆయన కేంద్ర ప్రభుత్వం ఎదుట కీలక ప్రతిపాదనలు పెట్టారు.

శాంతి చర్చలకు సిద్ధం..

ఉత్పీడిత ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సాయుధ సంఘర్షణ ఒక్కటే మార్గం కాదని తమ పార్టీ స్పష్టంగా ప్రకటించిందని అభయ్ అన్నారు. భారత ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రి, మావోయిస్టుల ఉద్యమం ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, రాష్ట్ర హోంమంత్రులు, అధికార, విపక్ష పార్టీ నాయకులు శాంతి చర్చల కోసం సానుకూల దృక్పథాన్ని అవలంభించాలని కోరారు. ఈ చర్చలకు పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

సైనిక దాడులు తీవ్రతరం..

2025 మార్చి చివరి వారంలో తన పేరిట (మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట) మైదాస్ అనే వ్యక్తి ద్వారా శాంతి చర్చల కోసం ప్రతిపాదనలు పంపించామన పేర్కొన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించలేదని ఆరోపించారు. బదులుగా 2023 జనవరిలో మావోయిస్టు పార్టీపై నిషేధం విధించి సైనిక దాడులు, కూబింగ్ ఆపరేషన్లు మరింత తీవ్రతరం చేశారని తెలిపారు.

ప్రభుత్వ దాడులు.. పార్టీ ప్రతిఘటన

దేశ వ్యాప్తంగా మావోయిస్టులకు కంచుకోట అయిన ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది పోలీసు బలగాలను మోహరించారని గుర్తు చేశారు. ముమ్మరంగా నిర్మూలన దాడులు (Suppression Operations) నిర్వహించినట్లుగా పేర్కొన్నారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు పార్టీ తీవ్రమైన ప్రతిఘటన చూపిందన్నారు. ఇందులో భాగంగా కామ్రేడ్ బస్వరాజు సహా కేంద్ర కమిటీ సభ్యులు ఇతర పార్టీ సభ్యులు అమరులయ్యారని తెలిపారు. ఆ పరిస్థితుల్లో శాంతి చర్చలను కొనసాగించడం చాలా కష్టమైందని అభయ్ అన్నారు. ప్రభుత్వం కూడా నిర్మూలన దాడులను ఆపివేసి, శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ చర్చలకు కేంద్ర హోంమంత్రి లేదా వారు నియమించిన ప్రతినిధి మండలితో సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

సమాజంలోని వివిధ వర్గాల సహకారం..

మావోయిస్టు పార్టీ దేశ వ్యాప్తంగా తమ అనుబంధ సంస్థలు, రాష్ట్రాలలోని సహచరులు, జనవాది, ప్రగతిశీల శక్తులు, వామపక్ష సంస్థలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించిందని అభయ్ తెలిపారు. కష్ట జీవులైన ప్రజలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, మతపరమైన అల్ప సంఖ్యాకులు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, కళాకారులు,శాంతి కమిటీల స్నేహితుల సహకారాన్ని ఆశిస్తున్నట్లుగా వెల్లండించారు. పార్టీ తమ ఆలోచనలను ఇమెయిల్, ఫేస్‌బుక్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఆకాశవాణి, దూరదర్శన్ వంటి మాధ్యమాల ద్వారా సమాచారాన్ని పార్టీ క్యాడర్‌కు చేరవేయాలని కోరారు. జైళ్లలో ఉన్న సహచరుల ఆలోచనలను కూడా సేకరించాలని అనుమతించాలని అభయ్ విజ్ఞప్తి చేశారు.

కాల్పులు విరమణ ప్రకటన రాష్ట్ర కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ, స్పెషల్ జోనల్ కమిటీ, సబ్ జోనల్ బ్యూరో సహిత పార్టీలోని వివిధ స్థాయిల నాయకులు ఏకగ్రీవంగా జారీ చేసినట్లుగా తెలిపారు. ఈ నిర్ణయం పార్టీ ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లడానికి, అడవుల్లో శాంతి వాతావరణాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించినదని అభయ్ స్పష్టం చేశారు.

Next Story