దక్షిణ బస్తర్‌ ఎన్‌కౌంటర్ ఘటనపై మావోయిస్టుల సంచలన ప్రకటన

by Ramesh Naini |

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన బస్తర్‌ ఎన్‌కౌంటర్ ఘటనపై మావోయిస్టుల సంచలన ప్రకటన విడుదల చేశారు.

దక్షిణ బస్తర్‌ ఎన్‌కౌంటర్ ఘటనపై మావోయిస్టుల సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన బస్తర్‌ ఎన్‌కౌంటర్ ఘటనపై మావోయిస్టుల సంచలన ప్రకటన విడుదల చేశారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో జనవరి 3న జరిగిన ఎన్‌కౌంటర్ ఘటనలో తమకు చెందిన 14 మంది సభ్యులు మృతి చెందినట్టు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించింది. మావోయిస్టుల ప్రకటన ప్రకారం, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు, కోంటా ఏరియా ఏసీ ఇన్‌ఛార్జ్ వెట్టి మంగడు, డివిజన్ కమిటీ సభ్యురాలు పోడియం జోగా, కోంటా ఏరియా ఏసీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హితేష్, కొందరు ఏరియా కమిటీ సభ్యులు, పార్టీ సభ్యులపై 2026 జనవరి 3న ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో బుర్కలంక, పామలూర్, గట్టాపాడ్ గ్రామాల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు దాడి చేశాయి. మా ఉనికిపై పక్కా సమాచారం అందుకున్న సీ.ఆర్.పీ.ఎఫ్ (C.R.P.F), కోబ్రా (Cobra), డీ.ఆర్.జీ (D.R.G) ఇతర భద్రతా బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి.

బూటకపు ఎన్‌కౌంటర్

ఈ దాడిలో మా 12 మంది సహచరులు అమరులయ్యారని తెలిపారు. అదే రోజు అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో బాసా గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగనపాడ్ గ్రామంలో సమాచారం ఆధారంగా పామేడ్ ఏరియా కమిటీ సభ్యుడు మడ్కం హుంగా దాదా, ఆయనతో పాటు ఉన్న ఆయతేను పోలీసులు పట్టుకున్నారని, వారిని అత్యంత క్రూరంగా హింసించి, బూటకపు ఎన్‌కౌంటర్ చేసి చంపేశారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా పోలీస్ అధికారులు మాత్రం అధికారికంగా ఇద్దరు నక్సలైట్లు మాత్రమే మృతి చెందినట్టు ప్రకటించినట్టు మావోయిస్టు ప్రకటనలో పేర్కొన్నారు. కానీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఈ ఘటనను బూటకపు ఎన్‌కౌంటర్‌ అని ఖండిస్తోంది. ఈ ఘటనల్లో మరణించిన వారంతా ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజల హక్కుల కోసం, జల్-జంగల్- జమీన్ పరిరక్షణ కోసం పనిచేసిన విప్లవకారులని పార్టీ తెలిపారు.

ఎన్నికల సంఘం మోడీ "గోదీ" సంఘం

ఆర్ఎస్ఎస్, బీజేపీ మనువాదులు దేశ సంపదను, ప్రకృతి వనరులను 'వికాసం' పేరుతో కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి.. కానీ పాలకులు కుట్రలతో, మతోన్మాదం, యుద్ధోన్మాదంతో ఆ ఉద్యమాలను అణిచివేస్తున్నారని ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగ సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, ఎన్నికల సంఘం మోడీ "గోదీ" సంఘంగా మారిపోయిందని తీవ్రంగా ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో భారీ ఎత్తున మోసాలకు పాల్పడి గెలిచారని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ అధికార ప్రతినిధి గంగా ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story