మావోయిస్టు పార్టీలో చీలిక? నిన్నటి లేఖ నకిలీదా..? అసలుదా..?

by Malleboina Mahesh |   (  Updated:2025-09-17 06:45:56  IST  )

దశాబ్దాలుగా తాము చేస్తున్న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు గత రాత్రి వెలువడిన మావోయిస్టుల లేఖ (Maoist letter) అసలుదా? నకిలీదా? అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది.

మావోయిస్టు పార్టీలో చీలిక? నిన్నటి లేఖ నకిలీదా..? అసలుదా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: దశాబ్దాలుగా తాము చేస్తున్న సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు గత రాత్రి వెలువడిన మావోయిస్టుల లేఖ (Maoist letter) అసలుదా? నకిలీదా? అనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తాము ఆయుధాలు వదిలేస్తామని, పోరాటం విరమిస్తామని, ఒక నెల రోజుల సమయమిస్తే, పార్టీలో అంతర్గత చర్చలు జరుపుకుని ఒక నిర్ణయం తీసుకుని చర్చలకు వస్తామని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ (Maoist Party Central Committee) అధికార ప్రతినిధి అభయ్ (Abhay) స్పష్టం చేశారు. లేఖపైన అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ఫొటో ఉండడం, చర్చలకు అనుకూలంగానూ, పార్టీ ఇంత కాలం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగానూ పలు వ్యాఖ్యలు ఉండడం పట్ల పలువురు వామపక్ష మేధావులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

లేఖ వెలువడినట్లు కొన్ని జాతీయ చానెళ్లలో రాగానే బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ స్పందించడం, ఇది ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాల విజయమని కీర్తించడం పైన కూడా చర్చ జరుగుతోంది. ఇది పోలీసులు సృష్టించిన నకిలీ లేఖనా? లేక మావోయిస్టు పార్టీ నిజంగానే తన వైఖరి మార్చుకుందా? లేక ఆ పార్టీలో ఒక చీలిక వర్గం ఈ ప్రకటనను ఇచ్చిందా? ఇలా రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

లేఖలో అభయ్ ఫొటో వివాదాస్పదం..

మావోయిస్టుల లేఖలో మొట్టమొదటిసారి అభయ్ ఫొటో ఉండడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని, అభయ్‌గా వ్యవహరిస్తున్నది మల్లోజుల వేణుగోపాల్ అని ఇప్పుడు చెప్పకనే చెప్పినట్లయిందని అంటున్నారు. కొంతకాలం క్రితం కోరుట్లకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్‌జీ సీసీ ప్రధాన కార్యదర్శి అయినట్టు వార్తలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఒక పుకారు వ్యాప్తి అయిందని, అందులో వేణును శాంతి చర్చలకు అనుకూలంగా ఉండడం, అగ్ర కులస్తుడు కావడం, ఆయన భార్య మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోవడం వంటి కారణాలతోనే కార్యదర్శిగా నియమించలేదనే వాదన ఉందని చెబుతున్నారు.

పది రోజుల కిందటి లేఖలో కఠిన వైఖరి..

కగార్ యుద్ధాన్ని విఫలం చేస్తూ, గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిద్దామని సీసీ పేరుతో పది రోజుల కిందటే మరో లేఖ విడుదల అయిన విషయం తెలిసిందే. మావోయిస్టు పార్టీ 21వ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని ఈ ప్రకటన సీసీ పేరుతో విడుదలైంది. గెరిల్లా యుద్ధాన్ని మరింత దృఢంగా కొనసాగిద్దామని, కగార్ దాడిని ఓడిద్దామని.. ఈ లేఖలో ప్రభుత్వాల పట్ల కఠిన వైఖరి వ్యక్తం కావడం ఇక్కడ గమనార్హమని ప్రస్తుత లేఖ నకిలీదని వాదిస్తున్న వాళ్లు అంటున్నారు. వీడియో కాల్ లో చర్చలు చేస్తామనడం, అభిప్రాయాలు చెప్పడానికి ఈ-మెయిల్, ఫేస్‌బుక్ ఐడీలు ఇవ్వడం కూడా వింతగా ఉందంటున్నారు.

పార్టీలో చీలిక ఏర్పడిందా?

తమకు నెల రోజుల సమయమివ్వమని లేఖలో అభయ్ కోరారు. ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పులు విరమించాలని, కూంబింగ్ ఆపాలని విన్నవించారు. ఈ సమయంలో తాము పార్టీలో దూర దూరంగా ఉన్న లేడర్లు, కేడర్లతో, జైలులో ఉన్న కేడర్లతో సంప్రదిస్తామని తెలిపారు. అంతిమంగా శాంతి చర్చలకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ పార్టీలో అభిప్రాయాలు ఉండవచ్చునని, అయితే చర్చలకు అనుకూలంగా ఉన్న వాళ్లతోనే ప్రతినిధివర్గాన్ని పంపిస్తామని చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తున్నది.

రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తారా?

అలాగే, పైన శీర్షికలోనే తాము సాయుధ పోరాటానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పి, ప్రజా సమస్యల కోసం పోరాడుతామని రాశారు. లోపల కూడా సమస్యలపై రాజకీయ పార్టీలతో, ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమాలు చేస్తామని ఉండడం పైన కూడా చర్చ జరుగుతోంది. తాము బహిరంగ జీవితంలోకి వస్తామని పరోక్షంగా చెప్పడమేనని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మావోయిస్టు పార్టీ పైనే ఉన్నది. నిజంగానే తమ పాలసీ మారిందా? లేక ఈ లేఖ నకిలీదా అన్న విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉన్నది. అప్పటివరకూ ఈ ఊహాగానాలు కొనసాగుతూనేవుంటాయి.

Next Story