- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అణురంగంలో చారిత్రక విజయం.. డిజిటల్ జనగణనపై ప్రధాని మోదీ కీలక పిలుపు
అణురంగంలో చారిత్రక విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కల్పకంలో ఉన్న ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ 'క్రిటికాలిటీ' (పూర్తిస్థాయి స్వయం శక్తితో పనిచేయడం) దశకు చేరుకోవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 6న జరిగిన ఈ పరిణామం భారత అణు శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనమని ఆయన కొనియాడారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో ఈ రియాక్టర్‌ను రూపొందించడం గర్వకారణమని, ఇది వికసిత భారత్ లక్ష్యానికి ఇంధన రంగం నుంచి గొప్ప బలాన్ని ఇస్తుందని చెప్పారు. 2024 మార్చిలో ఈ రియాక్టర్ లోడింగ్ ప్రక్రియను స్వయంగా చూసే అవకాశం తనకు లభించిందని గుర్తుచేసుకున్న మోదీ, అణు రంగ పురోగతి వల్ల ఆరోగ్యం, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు.
పవన విద్యుత్‌లో 56 గిగావాట్ల మైలురాయి
పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని తెలిపారు. దేశ పవన విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 56 గిగావాట్లకు చేరిందని, కేవలం గత ఒక్క ఏడాదిలోనే 6 గిగావాట్ల అదనపు సామర్థ్యాన్ని పెంచుకున్నామని వివరించారు. భవిష్యత్తు అవసరాల కోసం సౌర, పవన శక్తిపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
డిజిటల్ జనగణన-2027కు సహకరించండి
దేశంలో ప్రారంభం కానున్న 2027 జనగణన కార్యక్రమంలో పౌరులంతా ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని కోరారు. ఇది ప్రభుత్వ విధి మాత్రమే కాదని, బాధ్యతాయుతమైన పౌరుల కర్తవ్యమని పేర్కొన్నారు. ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని, ఎన్యుమరేటర్లు మొబైల్ యాప్ ద్వారా వివరాలు సేకరిస్తారని తెలిపారు. ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునేందుకు 'సెల్ఫ్ ఎన్యుమరేషన్' సదుపాయం కల్పించామని, దీనివల్ల సమయం ఆదా అవుతుందని సూచించారు. సేకరించిన సమాచారం అత్యంత రహస్యంగా, భద్రంగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
వెదురు ఉత్పత్తుల ప్రోత్సాహం - అంతర్జాతీయ గుర్తింపు
ఈశాన్య రాష్ట్రాల కళాకారులకు అండగా నిలిచేందుకు ప్రజలందరూ కనీసం ఒక వెదురు వస్తువునైనా కొనుగోలు చేయాలని లేదా బహుమతులుగా ఇవ్వాలని మోదీ కోరారు. అలాగే.. బ్రెజిల్‌లో జరిగిన అంతర్జాతీయ జున్ను (Cheese) పోటీల్లో రెండు భారతీయ బ్రాండ్‌లు అవార్డులు సాధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ పాడి ఉత్పత్తుల రుచి ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందుతోందని ప్రశంసించారు.
చిలీలో బౌద్ధ ప్రచారం.. బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు
త్వరలో రానున్న బుద్ధ పూర్ణిమ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, ప్రస్తుత అశాంతి కాలంలో బుద్ధుడి శాంతి మంత్రం ఎంతో అవసరమన్నారు. లడఖ్‌కు చెందిన ద్రుబ్‌పోన్ ఓట్జెర్ రిన్‌పోచె అనే వ్యక్తి దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలో బౌద్ధ బోధనలను వ్యాప్తి చేస్తూ, అక్కడ స్థూపాలను నిర్మిస్తున్నారని అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ఆధ్యాత్మికత వెలుగులు విరజిమ్ముతుండటం గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు.






