Manipur: మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ నిషేధం

by S Gopi |

వీపీఎన్, వీశాట్ సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Manipur: మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ నిషేధం
X

దిశ, నేషనల్ బ్యూరో: నిరంతరం ఘర్షణల్లో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరోసారి నిరసనలు చెలరేగాయి. వాటి అణచివేత కోసం ప్రభుత్వం మరోసారి మణిపూర్‌లో ఇంటర్నెట్‌పై నిషేధం విధించింది. తాజాగా మైతేయి నేత అరంబాయి టెంగొల్ అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో అల్లర్లు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. దీంతో 5 జిల్లాల్లో ఐదు రోజుల పాటు వీపీఎన్, వీశాట్ సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లకు కేంద్రంగా మారిన ప్రధాన ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కాక్చింగ్ జిల్లాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టేలా, విద్వేష ప్రసంగాలు, ఇతర వీడియో మెసేజ్‌లను ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ నిషేధాన్ని అమలు చేసింది.

మణిపూర్ ప్రభుత్వం జూన్ 7న ఉదయం 11.45 గంటల నుంచి ఐదు జిల్లాల్లో అన్ని రకాల ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే కంటెంట్ కారనంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం తెలిపింది. అరంబాయి టెంగొల్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంఫాల్ లోయలో అర్థరాత్రి నిరసన ప్రారంభమైంది. శనివారం రాత్రి మొదలైన ఉద్రిక్త పరిస్థితులు ఆదివారం ఉదయం వరకు కొనసాగాయి.

మణిపూర్ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు

హోం శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో కమిషనర్, సెక్రటరీ ఎన్ అశోక్ కుమార్.. కొంతమంది ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ఫోటోలు, ద్వేషపూరిత ప్రసంగాలు, వీడియో సందేశాలను ప్రసారం చేయడానికి సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. ఇది మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై తీవ్రమైన పరిణామాలను సృష్టించవచ్చు. తాత్కాలిక ఇంటర్నెట్ నిషేధం ద్వారా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే కంటెంట్‌ను నియంత్రించవచ్చు. అల్లరిమూకలు గుమిగూడడానికి, విధ్వంసక చర్యలకు దారితీసే పుకార్ల వ్యాప్తిని ఆపేందుకు తక్షణ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

Next Story