- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Manipur: మణిపూర్‌లో కొత్త ప్రభుత్వం.. సీఎం రేసులో ఐదుగురు నేతలు !
అల్లర్లతో అట్టుడుకున్న మణిపూర్‌లో సీఎం బిరేన్ సింగ్ రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: అల్లర్లతో అట్టుడుకున్న మణిపూర్ (Manipur)లో సీఎం బిరేన్ సింగ్ రాజీనామా అనంతరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే. అయితే మణిపూర్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 44 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే తోక్‌చోమ్ రాధేశ్యామ్ సింగ్ (Thokchom Radheshyam Singh) తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ అజయ్ కుమార్ భల్లా (Ajay kumar Bhalla) ను కలిశారు. వీరిలో 8 మంది బీజేపీ, ఒకరు ఎన్సీపీ, మరొకరు స్వత్రంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం రాదేశ్యామ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మినహా 44 మంది ఎమ్మెల్యేలు మణిపూర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎటువంటి వ్యతిరేకతా లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలోని ఇతర అనేక సమస్యలపై గవర్నర్‌తో చర్చించినట్టు తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రభుత్వం అవసరం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. గతంలో కొవిడ్ కారణంగా రెండేళ్లు కోల్పోయాం. అల్లర్లతో మరో రెండు సంవత్సరాలు వృథా అయ్యాయి’ అని తెలిపారు.
కాగా, 2023 మే 3 నుంచి మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 9న సీఎం బిరేన్ సింగ్ (Biren singh) రాజీనామా చేయగా అదే నెల 13న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ తాజాగా ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలవడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడితే సీఎం ఎవరనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. సీఎం రేసులో ప్రధానంగా సీనియర్ నేతలైన థోమ్ చోక్ సత్యబ్రత సింగ్, బసంత కుమార్, రాధేశ్యామ్ సింగ్, యుమ్నామ్ ఖేంచంద్ సింగ్, బిశ్వజిత్ సింగ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.






