Manipur: మణిపూర్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తివేత.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

by B.Srinivas |

మణిపూర్‌లోని తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది.

Manipur: మణిపూర్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ఎత్తివేత.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌(Manipur) లోని తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్‌(Mobile Internet)పై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. శాంతి భద్రతల పరిస్థితి, ఇంటర్నెట్ సేవలతో దాని పరస్పర సంబంధాన్ని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్, డేటా సేవలపై ఉన్న తాత్కాలిక సస్పెన్షన్‌లను తక్షణమే ఎత్తివేయాలని తెలిపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఇంటర్నెట్ వినియోగదారులందరినీ హెచ్చరించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తితే భవిష్యత్తులో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇంటర్నెట్ ఎత్తివేసిన వాటిలో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, జిరిబామ్, చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, ఫెర్జావాల్ జిల్లాలు ఉన్నాయి.

జిరి, బరాక్ నదులలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లల మృతదేహాలు కనుగొనబడిన తరువాత రాష్ట్రంలో హింస చెలరేగింది. ఆ తర్వాత శాంతిభద్రతల పరిరక్షణ కోసం నవంబర్ 16 న తొమ్మిది జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని చాలాసార్లు పొడిగించారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తరువాత బ్యాన్ ఎత్తి వేసింది. అయితే శాంతిభద్రతలకు ఆటంకం కలిగితే మళ్లీ ఇంటర్నెట్ నిషేధాన్ని అమలు చేయొచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, గతేడాది మే నుంచి రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

Next Story