అతను సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి కాదు

by Ajay Maddhiboyina |

బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న వ్యక్తికి, సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసుతో ఎలాంటి సంబంధం లేదని ముంబై పోలీసులు తెలిపారు.

అతను సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి కాదు
X

- వెల్లడించిన ముంబై పోలీసులు

దిశ, నేషనల్ బ్యూరో:

సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి ముంబై పోలీసుల అదుపులో ఉన్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని తేలింది. ఈ మేరకు బాంద్రా పోలీసులు శుక్రవారం ఒక స్పష్టతనిచ్చారు. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరిగింది. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని విచారిస్తున్నారనే సమాచారం మేరకు మీడియా అక్కడకు చేరుకుంది. అయితే బాంద్రా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న వ్యక్తికి, సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసుతో ఎలాంటి సంబంధం లేదని ముంబై పోలీసులు తెలిపారు. కాగా, సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి గురువారం బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో కనపడినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే అతను బట్టలు మార్చుకొని ట్రెయిన్ ఎక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు వసాయ్‌తో పాటు పాల్గర్ జిల్లాలోని నాలాసొపారాలో కూడా గాలిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి మొదట 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా.. శుక్రవారానికి ఆ సంఖ్యను 20కి పెంచారు. ముంబై పోలీసుల ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్, టెక్నికల్ డేటా ఆధారంగా నిందితుడి ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నారు.

Next Story