స్కామర్‌నే స్కాం చేసిన వ్యక్తి.. సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి పోస్ట్ వైరల్!

by Phanindra |

స్కామర్‌నే స్కాం చేసిన వ్యక్తి. చాట్ జీపీటీతో నిమిషాల్లో దొంగను పట్టేసిన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్!

స్కామర్‌నే స్కాం చేసిన వ్యక్తి.. సోషల్ మీడియాలో ఢిల్లీ వాసి పోస్ట్ వైరల్!
X

దిశ, నేషనల్ బ్యూరో: సైబర్ స్కామర్‌కు చుక్కలు చూపించాడో ఢిల్లీ వాసి. దీనికోసం చాట్‌జీపీటీ వాడుకొని, స్కామర్‌ను ఇరికించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకోగా.. అవి తెగ వైరల్ అయ్యాయి. తన కాలేజీ సీనియర్‌లా నటించిన ఒక స్కామర్.. తనను మోసం చేసేందుకు ప్రయత్నించినట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు. ‘ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేసిన స్కామర్.. నా కాలేజీ సీనియర్ అయిన ఐఏఎస్ అధికారినంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. తన స్నేహితుడు సీఆర్పీఎఫ్‌లో పనిచేస్తున్నాడని, అతను ట్రాన్స్‌ఫర్ అవుతుండటంతో తన వద్ద ఉన్న హై-ఎండ్ ఫర్నీచర్‌ను తక్కువ ధరకే అమ్మేసి వెళ్లిపోవాలనుకుంటున్నాడని ఆ స్కామర్ నాకు చెప్పాడు. నాకు అనుమానం వచ్చి, మా సీనియర్‌ను వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వగానే ఇది స్కాం అని అర్థమైంది’ అని వెల్లడించాడా ఢిల్లీ వాసి.

అయితే అక్కడితో కాల్ కట్ చేసి, ఫేక్ నంబర్‌ను బ్లాక్ చేయకుండా.. స్కామర్‌ను శిక్షించాలని అతను అనుకున్నాడు. దీంతో తను ఫర్నీచర్ కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అప్పుడు మరో వ్యక్తి తనకు వాట్సాప్‌లో కనెక్ట్ అయ్యాడని, ఆర్మీ యూనిఫాంలో ఉన్న ప్రొఫైల్ ఫొటో పెట్టుకొని, ఫర్నీచర్ ఫొటోలు షేర్ చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత డబ్బుల కోసం తొందరపడటం ప్రారంభించడంతో.. వాళ్లు పంపిన క్యూఆర్ కోడ్ పనిచేయడం లేదని, స్కాన్ చేయడం ఇబ్బందిగా ఉందని చెప్పాడా ఢిల్లీ యువకుడు. ఇదే సమయంలో చాట్‌జీపీటీ ఉపయోగించి, ఫేక్ పేమెంట్ పోర్టల్ కోడ్ తీసుకున్నానని, ఈ లింకు ఓపెన్ చేస్తే క్లిక్ చేసిన వారి ఫ్రంట్‌ కెమెరాతో ఫొటో తీసుకోవడంతోపాటు, వారి జియో లొకేషన్ కూడా తనకు వచ్చేలా డిజైన్ చేశానని వెల్లడించాడు.

నిమిషాల వ్యవధిలో ఈ కోడ్ రాగానే.. దాన్ని సదరు స్కామర్‌కు పంపి, క్యూఆర్ కోడ్‌ను ఆ లింకులో అప్‌లోడ్ చేస్తే త్వరగా వస్తుందని చెప్పాడు. ఆ స్కామర్ లింకుపై క్లిక్ చేయగానే అతని లొకేషన్, ఫొటో, ఐపీ అడ్రస్ నేరుగా యూజర్ చేతికందింది. వాటిని తిరిగి స్కామర్‌కు పంపిన సదరు వ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు చేశాని చెప్పాడు. దీంతో ఆ స్కామర్ తన కాళ్లాబేరానికి వచ్చాడని, రకరకాల నంబర్లతో ఫోన్స్ చేసి, ఇకపై ఎవర్నీ మోసం చేయబోనంటూ ఒట్లు పెట్టుకున్నాడని చెప్పాడా ఢిల్లీ వ్యక్తి. మరొకరిని అతను మోసం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఇలా స్కామర్‌ను స్కాం చేసిన థ్రిల్ మాత్రం తనకు దక్కిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Next Story