మానవత్వానికి నివాళి.. భార్య మృతదేహాన్ని బైక్ కు కట్టి..

by Naga Rani Yarlagadda |

జంతువులకు ఉన్నపాటి జ్ఞానం, వాటి మధ్య ఉండే సఖ్యత మనుషులకు లేదు అనడంలో తప్పు లేదు.

మానవత్వానికి నివాళి.. భార్య మృతదేహాన్ని బైక్ కు కట్టి..
X

దిశ, వెబ్‌డెస్క్: జంతువులకు ఉన్నపాటి జ్ఞానం, వాటి మధ్య ఉండే సఖ్యత మనుషులకు లేదు అనడంలో తప్పు లేదు. ఎవరికో ఏదో కష్టం వచ్చిందని అలా అనుకుంటున్నారని తీసిపారేస్తాం కానీ.. నిజంగానే మనకి కష్టం వస్తే.. ఆ కష్టంలో ఆదుకునేవారు చాలామందికి ఉండరు. కళ్లెదురుగా ఎంత ఆపదలో ఉన్నా సరే ఫొటోలు, వీడియోలు తీసుకుంటారే తప్ప.. మానవత్వంతో సహాయం చేయాలన్న ఆలోచన రాదు. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన.

వేగంగా వస్తోన్న ట్రక్కు ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. 35 ఏళ్ల తన భార్య మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సహాయం చేయాలని అటుగా వెళ్తున్న వారందరినీ ఏడుస్తూ అడిగాడు భర్త అమిత్ యాదవ్. ఒక్కరంటే ఒక్కరు కూడా అతనికి సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడం అమానవీయం. ఇది నిజంగా మానవత్వానికి నివాళి అర్పించాల్సిన ఘటన. ఆగస్టు 9, రక్షాబంధన్ రోజు జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమిత్, తన భార్యతో కలిసి బైక్ పై లోనారా నుంచి కరణ్ పూర్ కు వెళ్తుండగా.. మోర్ఫాటా సమీపంలో వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. అనంతరం డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది.

దాంతో ఆమె మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు పలువురిని సహాయం కోరగా.. ఎవరు స్పందించలేదు. చేసేది లేక.. మరో గత్యంతరం లేక అమిత్ తన భార్య మృతదేహాన్ని బైక్ కు కట్టి గ్రామానికి తరలిస్తుండగా.. పోలీస్ వెహికల్ అతడిని ఆపింది. జరిగిన విషయం తెలుసుకుని.. మృతదేహాన్ని నాగ్ పూర్లోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీకి తరలించారు. రోడ్డుప్రమాదంలో మరణించడంతో పోస్టుమార్టం నిర్వహించాక మృతదేహాన్ని అమిత్ కు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో కూడా పోలీసులు రికార్డ్ చేసిందేనని తెలుస్తోంది.

Next Story