బెంగాల్‌ను పాక్ టార్గెట్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?.. మోడీపై మమతా బెనర్జీ ఫైర్

by Gantepaka Srikanth |

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే మొదటగా కోల్‌కతానే లక్ష్యం చేసుకుంటామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి.

బెంగాల్‌ను పాక్ టార్గెట్ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా?.. మోడీపై మమతా బెనర్జీ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే మొదటగా కోల్‌కతానే లక్ష్యం చేసుకుంటామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ విపరీత వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. దేశ భద్రత విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిని ప్రశ్నిస్తూ ఆమె సంచలన డిమాండ్ చేశారు. ఇటీవల పాకిస్తాన్‌కు చెందిన ఓ మంత్రి మాట్లాడుతూ.. "భారత్-పాక్ మధ్య మళ్లీ యుద్ధం జరిగితే, మా మొదటి టార్గెట్ కోల్‌కతానే" అంటూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నుంచి ఎలాంటి గట్టి కౌంటర్ రాకపోవడంపై దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మమతా బెనర్జీ సూటి ప్రశ్నలు..

సోమవారం జరిగిన ఒక బహిరంగ సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. "పాక్ మంత్రి ఇంతటి సాహసానికి ఒడిగడితే.. ప్రధాని మోడీ గానీ, రక్షణ శాఖ మంత్రి గానీ ఎందుకు స్పందించడం లేదు? దేశ సమగ్రతపై దాడి జరుగుతుంటే మీ మౌనం దేనికి సంకేతం?" అని ప్రశ్నించారు. "కేవలం ఎన్నికల సమయంలోనే మీకు పశ్చిమ బెంగాల్ ప్రజలు గుర్తుకొస్తారా? ఓట్ల కోసం ఇక్కడికి వస్తారు కానీ, పొరుగు దేశం మన రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తామంటే ఎందుకు మాట్లాడటం లేదు?" అంటూ నిలదీశారు. దేశ సరిహద్దులను, ప్రజల ప్రాణాలను కాపాడలేనప్పుడు ప్రధాని ఆ పదవిలో ఉండే అర్హత లేదని, మోడీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బెంగాల్ ఆత్మగౌరవాన్ని, భద్రతను తాము ప్రాణాలకు తెగించి కాపాడుకుంటామని, కానీ కేంద్రం బాధ్యతారాహిత్యం దేశానికే ప్రమాదకరమని మమత పేర్కొన్నారు. పాకిస్థాన్ తోకముడిచేలా కేంద్రం నుంచి కఠినమైన హెచ్చరికలు రావాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం దీదీ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Next Story