- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు ఓటమిని అంగీకరించిన మమతా బెనర్జీ.. సోషల్ మీడియా బయో మార్చిన దీదీ
ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ తొలిసారి తన ఎక్స్ ప్రొఫైల్ బయోను మార్చింది. సువేందు అధికారి ప్రమాణ స్వీకారం తర్వాత ఈ మార్పు జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన ఎక్స్ అకౌంట్ ప్రొఫైల్ బయోను మార్చడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో బెంగాల్‌లో బీజేపీ విజయాన్ని మమతా పరోక్షంగా అంగీకరించినట్టేనా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
తాజాగా మమతా తన ప్రొఫైల్‌లో “Founder Chairperson, All India Trinamool Congress”తో పాటు “Chief Minister of West Bengal (15th, 16th and 17th Vidhan Sabha)” అని పేర్కొన్నారు. గతంలో ఆమె బయోలో “Honourable Chief Minister, West Bengal” అని ఉండేది. అయితే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా పేర్కొనేలా చేసిన ఈ మార్పు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. మొత్తం 207 స్థానాల్లో విజయం సాధించిన కమలం పార్టీ.. బెంగాల్ రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి తెరదించింది. ఈ విజయంతో సువేందు అధికారి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కు సాధించి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం అభివృద్ధి, పాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంపై దృష్టి పెడుతుందని సువేందు అధికారి హామీ ఇచ్చారు. కోల్‌కతాలో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎన్‌డీఏ కీలక నేతలు హాజరుకావడం జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
ఇక ఎన్నికల ఫలితాల తర్వాత మమతా బెనర్జీ రాజీనామా చేయాలని వచ్చిన డిమాండ్లను తీవ్రంగా తిరస్కరించారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. పోలింగ్ అనంతర హింస ఘటనలపై న్యాయపరమైన పోరాటం చేస్తామని కూడా పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా బయోలో చేసిన మార్పు.. మమతా రాజకీయ వైఖరిలో మార్పుకు సంకేతమా? లేక కేవలం ప్రొఫైల్ అప్‌డేట్ మాత్రమేనా? అన్నదానిపై బెంగాల్ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది.






