తత్కాల్ టికెట్స్ నుంచి యుటిలిటీ పేమెంట్స్ వరకూ.. జులై 1 నుంచి రానున్న మార్పులివే..

by Naga Rani Yarlagadda |

సాధారణంగా కొత్త క్యాలెండర్ సంవత్సరం లేదా ఆర్థిక సంవత్సరం మొదలైతే కొన్ని కీలక ఆర్థిక మార్పులు జరుగుతుంటాయి.

తత్కాల్ టికెట్స్ నుంచి యుటిలిటీ పేమెంట్స్ వరకూ.. జులై 1 నుంచి రానున్న మార్పులివే..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా కొత్త క్యాలెండర్ సంవత్సరం లేదా ఆర్థిక సంవత్సరం మొదలైతే కొన్ని కీలక ఆర్థిక మార్పులు జరుగుతుంటాయి. కానీ ఈసారి జులై నెల ప్రారంభంలోనే ఎన్నో కీలక మార్పులు అమలు కాబోతున్నాయి. అవి నేరుగా సామాన్య ప్రజల జీవనశైలిపై ప్రభావం చూపే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా పాన్ కార్డు, రైల్వే టికెట్లు, క్రెడిట్ కార్డులు, ఐటీఆర్, కార్ ధరలు వంటి విభాగాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

జులై 1 నుంచి పాన్ కార్డు తీసుకునేందుకు ఆధార్ సంఖ్య, ఆధార్ వేరిఫికేషన్ తప్పనిసరి అవుతుంది. ఇప్పటివరకు ఇతర గుర్తింపు పత్రాలతో పాన్ జారీ చేయగా ఇకపై ఇది మారనుంది. ఇప్పటికే ఉన్న వారికి పాన్-ఆధార్ లింక్‌ తప్పనిసరి చేసినట్టు ముందే స్పష్టత ఇచ్చారు.

తత్కాల్ రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

జులై 1 నుంచి తత్కాల్ టికెట్ల కోసం ఆధార్ అథెంటికేషన్ పూర్తయినవారికే బుకింగ్ అవకాశం ఉంటుంది. జులై 15 నుంచి బుకింగ్ సమయంలో ఓటీపీ ఎంటర్ చేయడం కూడా తప్పనిసరిగా మారనుంది. ఇక రైల్వే ఏజెంట్లకు టికెట్ బుకింగ్ ప్రారంభమైన 30 నిమిషాల తర్వాతే టికెట్లు బుక్ చేసుకునే అనుమతిని ఇచ్చారు. అంటే AC టికెట్లు ఉదయం 10.30కి, నాన్ AC టికెట్లు 11.30కి మాత్రమే బుకింగ్‌ చేయవచ్చు.

రైల్వే టికెట్ ధరల పెంపు

జులై 1 నుంచి మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో టికెట్ ధరలు పెరుగుతున్నాయి. నాన్-AC కింద ప్రయాణానికి కిలోమీటరుకు 1 పైసా, AC కేటగిరీలకు 2 పైసలు చొప్పున ధరలు పెంచారు. 500 కిలోమీటర్ల దాటి ప్రయాణిస్తే సెకండ్ క్లాస్‌కి ఇదే రేటు వర్తిస్తుంది.

క్రెడిట్ కార్డు నిబంధనల మార్పులు.. హెచ్‌డీఎఫ్‌సీ

HDFC బ్యాంక్ జులై 1 నుంచి క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు చేస్తోంది. రూ.10,000 పైబడే వాలెట్ లోడింగ్‌, రూ.50,000 దాటి యుటిలిటీ బిల్లులు, గేమింగ్ లావాదేవీలపై 1% ఫీజు విధించనుంది. రెంటల్‌, ఎడ్యుకేషన్ పేమెంట్లకు కూడా ఇదే ఫీజు వర్తిస్తుంది. ఆన్‌లైన్ గేమింగ్‌ ట్రాన్సాక్షన్లపై రివార్డులు పూర్తిగా తొలగించింది.

ఎంజీ మోటార్ కార్ల ధరల పెంపు

JSW MG Motor కంపెనీ జులై 1 నుంచి తమ వాహనాల ధరలు 1.5% వరకు పెంచనున్నట్లు తెలిపింది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కామెట్ నుంచి గ్లోస్టర్ వరకూ అందుబాటులో ఉన్న మోడళ్లపై ఈ పెంపు వర్తిస్తుంది.

ఐటీఆర్ దాఖలుకు గడువు పెంపు

ఈసారి ఐటీఆర్ ఫైలింగ్‌లో మార్పుల కారణంగా కేంద్రం గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు మరో 45 రోజులు అదనంగా సమయం లభించింది. అయితే పత్రాలు సిద్ధంగా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే దాఖలు చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. జులై నెలలో పెద్దగా పండగలు లేకపోవడంతో.. 2వ, 4వ శనివారాలు, ఆదివారాలు మినహాయిస్తే మిగతా అన్ని రోజుల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.

Next Story