Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-09 10:24:12  IST  )

తైవాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది.

Taiwan: తైవాన్‌లో భారీ భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్: తైవాన్‌లో (Taiwan) మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం (ఏప్రిల్ 9) ఉదయం రాజధాని తైపేలోని (Taipei) పలు ప్రాంతాల్లో కొన్ని క్షణాల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్లలోంచి బయటకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై (Richter scale) 5.8 ఉన్నట్లు తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. ఈశాన్య తీరంలోని యిలాన్‌ నగరంకు ఆగ్నేయంగా 21 కిలోమీటర్లు దూరం.. భూమికి 69 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరుగలేదని వెల్లడించింది. కాగా, ఈ నెల ఈ నెల 3, 4 తేదీల్లోనూ భూకంపాలు వచ్చిన విషయం తెలిసిందే.

తైవాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ దేశ చరిత్రలో 1999లో అతి పెద్ద భూకంపం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 2,415 మంది ప్రాణాలు కోల్పోగా , వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. నాటి నుంచి అక్కడి ప్రభుత్వం నిత్యం ప్రజల్లో భూకంపాలపై అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఇక మార్చి 28న థాయిలాండ్, మయన్మార్‌లో భారీ భూకంపాలు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో 3,600 మంది మృతి చెందగా, 5,017 మంది గాయపడ్డారు. 160 మంది గల్లంతయ్యారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్, టెలిఫోన్ సేవలకు అంతరాయం కలిగించింది. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.

Next Story