పాక్ యూజర్‌ను తిట్టిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు

by Phanindra |

పాక్ యూజర్‌ను తిట్టిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు. షర్మిష్ఠను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కోల్‌కతా కోర్టు.

పాక్ యూజర్‌ను తిట్టిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్ట్ చేసిన కోల్‌కతా పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని పుణెకు చెందిన 19 ఏళ్ల షర్మిష్ఠ పనోలీ అనే అమ్మాయిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ‘ఆపరేషన్ సిందూర్‌’ గురించి ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియోపై.. ‘ఎలాంటి కారణం లేకుండా పాక్‌పై భారత్ దాడులు చేసింది’ అంటూ ఒక పాకిస్తాన్ అమ్మాయి కామెంట్ చేసింది. దీంతో కోపంగా రియాక్ట్ అయిన షర్మిష్ఠ.. ‘పహెల్గాం దాడి, ఉగ్రవాదులకు పాక్ ఇస్తున్న సపోర్ట్ గురించి ఎప్పుడూ వినలేదా?’ అని ప్రశ్నించింది. అక్కడితో ఆగకుండా కొన్ని మతపరమైన వ్యాఖ్యలు కూడా చేయడంతో ఆమెపై కోల్‌కతాలో కొందరు కేసు పెట్టారు.


ఈ వీడియో వివాదాస్పదమైందని తెలుసుకున్న షర్మిష్ఠ దాన్ని డిలీట్ చేసి, క్షమాపణలు చెప్పింది. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు షర్మిష్ఠను కోల్‌కతా తీసుకొచ్చి మరీ అలీపూర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లో జరిగే ఘోరాలపై స్పందించని కోల్‌కతా పోలీసులు.. పక్క రాష్ట్రాల్లో వ్యక్తులు వీడియోలు చేస్తే మాత్రం వేల కిలోమీటర్లు వెళ్లి మరీ అరెస్టులు చేస్తారంటూ విమర్శలు వస్తున్నాయి.

Next Story