- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాజా ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ముప్పు.. ప్రాణాపాయం నుంచి బయటపడిన వందలాది ప్రయాణికులు
భారత్‌లో అత్యంత విలాసవంతమైన పర్యాటక రైళ్లలో ఒకటైన ‘మహారాజా ఎక్స్‌ప్రెస్’ను పట్టాలు తప్పించేందుకు పన్నిన భారీ కుట్ర జైపూర్ సమీపంలో భగ్నమైంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో అత్యంత విలాసవంతమైన పర్యాటక రైళ్లలో ఒకటైన ‘మహారాజా ఎక్స్‌ప్రెస్’ను పట్టాలు తప్పించేందుకు పన్నిన భారీ కుట్ర జైపూర్ సమీపంలో భగ్నమైంది. లోకో పైలట్ అప్రమత్తతతో వందలాది విదేశీ పర్యాటకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
జైపూర్ నుంచి సవాయి మాధోపూర్‌కు వెళ్తున్న ఈ రైలు మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో శివ్దాస్పురా ప్రాంతంలోని మహాత్మా గాంధీ ఆస్పత్రి సమీప రైల్వే క్రాసింగ్ వద్దకు చేరుకున్నప్పుడు ఈ ఘటన జరిగింది. పట్టాలపై ఇనుప కడ్డీలు ఉంచినట్లు గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేశారు. దీంతో రైలు సకాలంలో ఆగిపోయి పెను ప్రమాదం తప్పింది. రైల్వే వర్గాల సమాచారం ప్రకారం.. సుమారు 5-6 ఇనుప కడ్డీలు రైలును పట్టాలు తప్పించాలనే ఉద్దేశంతో ట్రాక్‌పై పెట్టారు. దాదాపు 35 నిమిషాల పాటు రైలును నిలిపివేసి ఆ కడ్డీలను ట్రాక్ పై నుంచి తొలగించారు. సమాచారం అందగానే ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్), జీఆర్‌పీ (గవర్నమెంట్ రైల్వే పోలీస్), స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో ట్రాక్‌ను పూర్తిగా తనిఖీ చేశారు. ఎలాంటి ప్రమాదమూ లేదని నిర్ధారించిన తర్వాత రైలు సేవలను పునఃప్రారంభించారు.
ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో ట్రాక్ పెట్రోలింగ్, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోకో పైలట్ సమయస్ఫూర్తి, చురుకైన చర్యల వల్ల వందలాది విదేశీ పర్యాటకులు సహా ప్రయాణికుల ప్రాణాలు కాపాడగలిగామని అధికారులు వెల్లడించారు. లేకపోతే ఇది భారీ విషాదంగా మారేదని పేర్కొన్నారు.
ఇది ఒక్కరి పని కాదని అధికారులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో సిరోహీ జిల్లాలో అరావళి ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించేందుకు ట్రాక్‌పై దండ పెట్టిన ఘటన వెలుగుచూసింది. అంతకుముందు అజ్మీర్ ప్రాంతంలో కూడా ఇలాంటి కుట్రలు బయటపడ్డాయి. ఇటీవలి నెలల్లో రైళ్లపై రాళ్ల దాడులు కూడా పెరిగాయి. ఉదయ్‌పూర్, అల్వార్ ప్రాంతాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరిగింది. అల్వార్ జిల్లాలో ఇంటర్‌సిటీ ఖజురాహో ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీ అద్దం ధ్వంసమైంది. అదే ప్రాంతంలో సరుకు రైలును పట్టాలు తప్పించేందుకు కూడా ప్రయత్నం జరిగినట్లు అధికారులు తెలిపారు.
Read More..






