- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maha Kumbh Foreigners: ఒకే కుటుంబం, ఒకే ఆత్మబంధం.. మహాకుంభమేళా నిరూపించిన సత్యం
Mahakumbhmela: మహాకుంభమేళ ముగిసింది. 65 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. అందులో 30 లక్షల మంది విదేశీయులు ఉన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: Mahakumbhmela: మహాకుంభమేళ ముగిసింది. 65 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. అందులో 30 లక్షల మంది విదేశీయులు ఉన్నారు.
భరత భూమి అందరికీ తల్లి.. ఈ సనాతన సంస్కృతి సమస్త మానవాళికి ఆశ్రయం.. ఈ దేశం మత, వర్ణ, జాతీయ భేదాలకు అతీతంగా 'వసుధైవ కుటుంబం' అనే సత్యాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. మహాకుంభమేళా ద్వారా మరోసారి అదే నిజమని తేలింది. 45రోజుల పాటు సాగిన ఈ మహోత్సవం ప్రపంచానికి శాశ్వతమైన సందేశాన్ని అందించింది. మతాలకతీతంగా అందరూ ఏకమనే భావనను చాటిచెప్పింది. మహాకుంభమేళకు పోటెత్తిన విదేశీ భక్తుల సంఖ్యే దీనికి ఉదాహరణ. ఈ భారీ జనసందోహాన్ని నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అద్భుత ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. భద్రతా పరంగా 2 లక్షల మంది పోలీసులు, వివిధ రకాల టెక్నాలజీ ఆధారిత భద్రతా పద్ధతులు అమలు చేశారు. ఆరోగ్య శిబిరాలు, తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేశారు.
అటు భగీరథ తపస్సుతో దిగి వచ్చిన గంగ, యమునా, సరస్వతీ నదుల సంగమంలో స్నానం చేయడం ఒక పుణ్య కార్యం. 65 కోట్లకు పైగా భక్తులు తమ భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర సందర్భాన్ని సజీవం చేశారు. అందులో 30 లక్షల మంది విదేశీయులు సనాతన ధర్మపు మహత్త్వాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. ఇక్కడ భక్తి ఒక్కటే రాజ్యమని.. భగవంతుని పేరును జపించడమే ముఖ్యమని మెక్సికో నుంచి వచ్చిన అనా తన అనుభూతిని పంచుకుంది. ఈ దేశం తమని తమ సొంత ఇంట్లో ఒకరిలా స్వీకరించిందని చెప్పింది. ఇక్కడ పరమాత్మ స్థితిని ప్రత్యక్షంగా అనుభవించగలిగామని.. ఈ వాతావరణం తమ హృదయాలను తాకిందని రష్యా నుంచి స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులు చెప్పుకొచ్చారు.
భక్తి అంటే భాష కాదు.. దేశం కాదు, మతం కాదు.. అది హృదయాన్ని తాకే ఓ పవిత్ర ప్రవాహం..! ఈ పవిత్ర ప్రవాహం గంగా తరంగాలతో సంగమించేటప్పుడు, అది కేవలం భారత్‌ను మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని తనలో కలుపుకుంది. అందుకే మహాకుంభమేళా కేవలం భారతీయుల పండుగగా కాకుండా, విశ్వ మానవత్వానికి ఓ ప్రబోధంగా మారింది. మహాకుంభమేళాకు విదేశీయులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం చేసిన ప్రణాళికలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
భారత విదేశీ వ్యవహారాల శాఖ, పర్యాటక శాఖ సంయుక్తంగా వందకు పైగా దేశాల్లో ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. మహాకుంభమేళాకు వచ్చే విదేశీ భక్తులకు ఈ-వీసా ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ లింకులు, హెలికాప్టర్ టూర్లు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి, యాత్రికులకు భరోసా కలిగించింది. అటు ప్రత్యేకంగా విదేశీయులకు పర్యాటక శిబిరాలు ఏర్పాటు చేసింది. భాష అర్థమయ్యేలా వివరించడానికి ట్రాన్స్‌లేటర్లను అందుబాటులో ఉంచింది. అటు 2 లక్షల మంది భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. వెయ్యికు పైగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ సర్‌వైలెన్స్‌తో 24 గంటలు పర్యవేక్షణ కొనసాగింది. అందుకే విదేశీయులు తరలివచ్చారు. భాషను పక్కనపెట్టి హర హర మహాదేవ అంటూ భగవంతుని తలచుకున్నారు.
నిజానికి భారతీయులు మత, జాతి, వర్ణ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారని విదేశీయులు భావిస్తారు. మత మార్గాలన్నీ సముద్రంలో కలిసే నదుల్లా ఒకటే అని భారతీయ సంస్కృతి చెబుతోంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులు ఈ ఏకత్వ భావనను ప్రత్యక్షంగా అనుభవించారు. కుంభమేళా కేవలం హిందువుల పండుగ కాదు.. ఇది విశ్వమానవతా తత్త్వాన్ని ప్రకటించే ఆధ్యాత్మిక సంగమం. ఇది భక్తి, సేవ, ఆత్మీయత, మానవత్వపు పునరుజ్జీవనం. ప్రపంచమంతా భారత్‌ను గౌరవించడానికి ప్రధాన కారణం ఇదే. మొత్తంగా చూస్తే మహాకుంభమేళ మతాల మధ్య భేదాలను చెరిపివేసి, ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడాలనే వసుధైవ కుటుంబం అనే తత్త్వాన్ని ప్రతిఫలింపజేసింది.






