- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbh: పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ నుంచి 68 మంది మహాకుంభమేళాకు.. పవిత్రస్నానాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ నుంచి 68 మంది హాజరయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాకు పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్ నుంచి 68 మంది హాజరయ్యారు. ఈ 68 మంది హిందూ భక్తుల బృందం గురువారం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తమ పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ బృందంలోని మహంత్ రామ్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. తాము మొదట హరిద్వార్‌ను సందర్శించామని, అక్కడ దాదాపు 480 మంది పూర్వీకుల చితాభస్మాన్ని నిమజ్జనం చేశామన్నారు. మహా కుంభమేళాకు వచ్చే ముందు ఆచారాలు నిర్వహించామని చెప్పారు. మరో భక్తుడు మాట్లాడుతూ.. మహాకుంభమేళా గురించి విన్నప్పట్నుంచి ఎప్పుడెప్పుడు సందర్శిస్తామా అని ఎదురుచూసినట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉండటం మన సనాతన ధర్మ వారసత్వం గురించి గర్వపడేలా చేస్తుందని మరొకరు అన్నారు. "ప్రస్తుతం వీసా క్లియరెన్స్ పొందడానికి దాదాపు ఆరు నెలలు పడుతుంది. అయితే, ఈసారి మా బృందానికి సులభంగా వీసాలు మంజూరయ్యాయి. అందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు" అని మరొకరు అన్నారు. మహాకుంభమేళా నుంచి రాయ్ పూర్ వెళ్లి.. అక్కడ్నుంచి హరిద్వార్ వెళ్తామన్నారు.
40 కోట్ల మంది
ఇకపోతే, గతేడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్ నుండి 250 మంది ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి గంగానదిలో స్నానం చేశారు. ఈసారి సింధ్‌లోని ఆరు జిల్లాలైన ఘోట్కి, సుక్కూర్, ఖైర్‌పూర్, షికార్‌పూర్, కార్కోట్, జటాబల్ నుండి 68 మంది వచ్చారు. వీరిలో దాదాపు 50 మంది తొలిసారి భారత్ ను సందర్శిస్తున్నవారే. మరోవైపు, మహాకుంభమేళాను ఇప్పటివరకు 40 కోట్ల మంది భక్తులు సందర్శించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం 48 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు తెలిపింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి నాడు పెద్దసంఖ్యలో భక్తులు వచ్చినట్లు వెల్లడించింది. మౌని అమావాస్యనాడు 8 కోట్ల మంది, మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, వసంత పంచమి రోజున 2.57 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు తెలిపింది. జనవరి 30, ఫిబ్రవరి 1న పూర్ణిమ సందర్భంగా 1.7 కోట్ల మంది గంగాస్నానాలు చేసినట్లు వెల్లడించింది. ఇకపోతే, 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.






