- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

- పుణ్య స్నానాల తేదీల వెల్లడి
- శివరాత్రితో ముగియనున్న మేళా
- 35 కోట్ల మంది భక్తులు రావొచ్చని అంచనా
- రూ.7 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిన ప్రభుత్వం
దిశ, నేషనల్ బ్యూరో:
హిందూ మతంలో అతిపెద్ద, అత్యంత పవిత్ర పుణ్య కార్యాల్లో ఒకటిగా భావించే కుంభమేళా ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. కానీ ఈ సారి ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తుంది 144 ఏళ్లకు వచ్చే మహా కుంభమేళా కావడంతో ఈ శుభకార్యంలో పాల్గొనడానికి కోట్లాది మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న మహా కుంభమేళ సందర్భంగా గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. జనవరి 13న పుష్య పూర్ణిమ స్నానంతో ప్రారంభమయ్యే ఈ మహా కుంభమేళ.. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ముగుస్తుంది. మహా కుంభ మేళాలో పుష్య పౌర్ణమి (జనవరి 13), మకర సంక్రాంతి/మొదటి షాహీ స్నానం (జనవరి 15), మౌని అమావాస్య/రెండో షాహా స్నానం (జనవరి 29), వసంత పంచమి/మూడో షాహీ స్నానం (ఫిబ్రవరి 3), మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 12), మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) తేదీల్లో పవిత్ర స్నానాలు ఆచరించాలని పండితులు ఇప్పటికే వెల్లడించారు. ఈ పవిత్ర స్నాన ఆచారాలు లేదా షాహి స్నానాలు ఆత్మను శుద్ధి చేస్తాయని, పాపాలను కడిగేస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ స్నానాలు ఆచరించడానికి ముఖ్యమైన మూడు సమయాలను కూడా పండితులు నిర్ణయించారు. ఉదయం 5.27 నుంచి ఉదయం 6.21 వరకు బ్రహ్మ ముహూర్తం, మధ్యాహ్నం 2.15 నుంచి 2.57 వరకు విజయ ముహూర్తం, సాయంత్రం 5.42 నుంచి 6.09 వరకు గోధూళి ముహూర్తంగా చెబుతున్నారు.
35 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా : యూపీ సీఎస్ మనోజ్ కుమార్ సింగ్
ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి 35 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ వెల్లడించారు. త్రివేణి సంగమానికి సమీపంలోనే మహా కుంభమేళ కోసం ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. మౌని అమావాస్య రోజు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. 45 రోజుల పాటు సాగనున్న ఈ మహా కుంభమేళా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7,000 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు. గత కుంభమేళా పారిశుథ్యానికి తలమానికంగా నిలిచింది. ఈ సారి కుంభమేళా పారిశుథ్యంతో పాటు సెక్యూరిటీ, డిజిటల్ సదుపాయాలకు ప్రసిద్ధి కానుందని సింగ్ పేర్కొన్నారు.
గతంలో కంటే ఈ సారి కుంభమేళాకు 25 శాతం అదనంగా స్థలాన్ని కేటాయించినట్లు మనోజ్ కుమార్ వెల్లడించారు. గతంలో 3,200 హెక్టార్లలో కుంభమేళాకు ఏర్పాట్లు చేయగా.. ఈ సారి 4 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మేళా జరగనుందని వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాను 25 సెక్టార్లుగా విభజించామని, అలాగే స్నానాలు ఆచరించే ఘాట్లను 12 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం 1850 హెక్టార్ల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2019లో జరిగిన కుంభమేళాకు రూ.3,500 కోట్ల కేటాయించగా.. మహా కుంభమేళాకు బడ్జెట్‌ను రెట్టింపు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హైవేస్, రైల్వే శాఖలు కూడా ఈ కుంభమేళా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ మనోజ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.






