Madagascar: జెన్ జీ తిరుగుబాటు ఎఫెక్ట్.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు

by B.Srinivas |

ఈస్ట్ ఆఫ్రికా దేశమైన మడగాస్కర్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. గత కొన్ని రోజులుగా జెన్ జీ నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Madagascar: జెన్ జీ తిరుగుబాటు ఎఫెక్ట్.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈస్ట్ ఆఫ్రికా దేశమైన మడగాస్కర్‌ (Madagascar) లో రాజకీయ సంక్షోభం నెలకొంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెన్ జీ (zen-z) నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశం విడిచి పారిపోయారు. దీంతో దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్టు మడగాస్కర్ సైన్యం ప్రకటించింది. ఎలైట్ యూనిట్‌లో కమాండర్ అయిన కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా జాతీయ రేడియోలో ఈ ప్రకటన చేశారు. దేశ సాయుధ దళాలు అధికారాన్ని చేజిక్కించుకున్నాయని తెలిపారు. పార్లమెంటు దిగువ సభ మినహా అన్ని సంస్థలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. సైన్యం, శాంతిభద్రతల దళం అధికారులతో కూడిన ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి త్వరగా ప్రధానమంత్రిని నియమిస్తామన్నారు. అయితే సైనిక తిరుగుబాటు తర్వాత తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, అందుకే దేశం విడిచి పారిపోయానని రాజోలినా ఓ టెలివిజ్ ప్రసంగంలో చెప్పారు. దేశంలో ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించడానికి చర్చలు జరపాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు.

తిరుగుబాటుకు కారణమిదే?

మడగాస్కర్‌లోని 3 కోట్ల మంది జనాభాలో దాదాపు మూడొంతుల మంది పేదరికంలో జీవిస్తున్నారు. జీడీపీ సైతం బాగా తగ్గిపోయింది. అంతేగాక దేశంలో నీరు, విద్యుత్ కొరత వేధిస్తోంది. దీంతో గత నెల 25న నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ సమస్యలను ప్రెసిడెంట్ ఆండ్రీ రాజోలినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. భారీగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ ఉద్యమానికి యువత జెన్ జీ మడగాస్కర్ అని పేరుతో ఆందోళనలు చేపట్టారు. రాజోలినా రాజీనామాకు డిమాండ్ చేశారు. సైన్యం సైతం నిరసనకారులకు మద్దతు తెలిపింది. ఆందోళనలు ఉధృతం కావడంతో రాజోలినా దేశం విడిచి పారిపోయారు.

Next Story