1454 అడుగుల ఎత్తులో లవ్ ప్రపోజల్.. హైలైట్‌గా ప్రేయసికి అక్కడే కిస్

by Gantepaka Srikanth |

ప్రముఖ ఓటీటీ "స్కైవాకర్స్: ఎ లవ్ స్టోరీ" డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రష్యన్ సాహస జంట ఏంజెలా నికోలావ్ (33), ఇవాన్ బిర్కస్ (32) మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

1454 అడుగుల ఎత్తులో లవ్ ప్రపోజల్.. హైలైట్‌గా ప్రేయసికి అక్కడే కిస్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఓటీటీ "స్కైవాకర్స్: ఎ లవ్ స్టోరీ" డాక్యుమెంటరీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రష్యన్ సాహస జంట ఏంజెలా నికోలావ్ (33), ఇవాన్ బిర్కస్ (32) మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఎలాంటి భద్రతా వలయాలు, రోప్‌లు లేకుండా న్యూయార్క్‌లోని అత్యంత ఎత్తైన ఐకానిక్ కట్టడం 'ఎంపైర్ స్టేట్ బిల్డింగ్' (Empire State Building) యాంటెన్నా పైకి ఎక్కి అక్కడ తమ నిశ్చితార్థాన్నీ వినూత్నంగా జరుపుకున్నారు. అయితే, ఈ సాహసం ముగిసిన వెంటనే న్యూయార్క్ పోలీసులు (NYPD) వారిని అరెస్ట్ చేశారు.

1,454 అడుగుల ఎత్తులో లవ్ ప్రపోజల్..

బుధవారం మధ్యాహ్నం నల్లటి దుస్తులు, మాస్కులు ధరించిన ఈ జంట, భవనంలోని 102వ అంతస్తులో ఉన్న ఒక లాక్డ్ మెయింటేనెన్స్ హాచ్ ద్వారా భద్రతా సిబ్బంది కళ్లుగప్పి పైకి చేరుకున్నట్లు తెలుస్తోంది. భూమికి దాదాపు 1,454 అడుగుల (443 మీటర్లు) ఎత్తులో ఉన్న బిల్డింగ్ యాంటెన్నా చివరి అంచున నిలబడి వారు ఒకరినొకరు ముద్దాడారు. ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద నల్లటి బ్యానర్ను ప్రదర్శించారు. దానిపై "ప్రేమ శక్తి, అధికారంపై ఉన్న ప్రేమను ఓడించినప్పుడు.. ఈ ప్రపంచం శాంతిని చూస్తుంది" (When the power of love beats the love of power the world knows peace) అని రాసి ఉంది. ఆ బ్యానరు చుట్టేసి, కొద్దిగా కింద ఉన్న ఒక వెడల్పాటి వేదికపైకి రాగానే, ఇవాన్ బీర్కస్ మోకాళ్లపై కూర్చుని ఏంజేలాకు ఉంగరాన్ని అందిస్తూ పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఆమె ఆనందంగా ఒప్పుకోవడంతో ఇద్దరూ కౌగిలించుకుని సెల్ఫీలు దిగారు.

పోలీసుల ఎంట్రీ - అరెస్ట్..

ఈ దృశ్యాలను గమనించిన స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యపోగా, వెంటనే సమాచారం అందుకున్న న్యూయార్క్ పోలీసుల ఎమర్జెన్సీ సర్వీసెస్ విభాగం రంగంలోకి దిగింది. నిచ్చెనల సహాయంతో యాంటెన్నాపైకి చేరుకున్న పోలీసు అధికారి బాడీ కెమెరా విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. "హలో, మీరు ఇక్కడ ఉండకూడదు" అని పోలీస్ అనగా.. "మాకు నిశ్చితార్థం జరిగింది" అని ఆ జంట సమాధానం ఇచ్చింది. కిందికి రాగానే పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. వారిపై దొంగతనం (Burglary), నిర్లక్ష్యంగా ప్రాణాలను పణంగా పెట్టడం (Reckless Endangerment), క్రిమినల్ ట్రెస్పాస్ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Next Story