ప్రేమ పెళ్లి పాపమైంది! కుటుంబం మొత్తానికి శిరోముండనం చేసిన ఊరి పెద్దలు!

by Yella Dhawani Reddy |

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోట్స్, చాట్‌జీపీటీ, సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు వంటి టెక్నాలజీల గురించి మాట్లాడుతున్నారు.

ప్రేమ పెళ్లి పాపమైంది! కుటుంబం మొత్తానికి శిరోముండనం చేసిన ఊరి పెద్దలు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం డిజిటల్ యుగం (Digital era) నడుస్తోంది. ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోట్స్, చాట్‌జీపీటీ, సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు వంటి టెక్నాలజీల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నో పనులను మనిషి కంటే వేగంగా యంత్రాలు చేసేస్తున్నాయి. మరో కొద్ది రోజుల్లో రోబోలు రాజ్యం చేస్తాయని చెప్పేంతగా విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. కానీ ఇదంతా ఒకవైపు మాత్రమే.. మరొకవైపు మనం ఇంకా ఎంతటి అనాగరికంలో ఉన్నాయో తెలియజేసే షాకింగ్ ఘటనలు బయటకు వస్తున్నాయి. కులం, మతం, గ్రామ సంప్రదాయాలు అనే పేర్లతో ఘోరమైన అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారని వారి కుటుంబాలను శిక్షించటం, గ్రామం నుంచి వెలివేయడం వంటి ఘటనలు నేటికీ మన దేశంలో జరుగుతుండటం బాధాకరంగా ఉంది. తాజాగా ఇలాంటి అనాగరికమైన ఒడిశాలో వెలుగుచూసింది.

రాయగడ జిల్లా (Rayagada district of Odisha) కాశీపూర్‌ సమితిలో గోరఖ్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి అదే ప్రాంతానికి చెందిన షెడ్యూల్డ్‌ కులానికి చెందిన యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లి యువతి కుటుంబసభ్యులు అంగీకరించకపోవటంతో మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. గురువారం రోజులు నూతన వధూవరులు గ్రామానికి రావటంతో విషయం గ్రామ పెద్దలకు తెలిసింది. గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించి కులాంతర వివాహం చేసుకున్న యువతి కుటుంబ సభ్యులను ఊరిలోంచి వెలివేస్తున్నట్టు ప్రకటించారు. దీని నుంచి తప్పించుకోవాలంటే శిక్షగా శిరోముండనం (గుండు గీయించుకోవాలి) చేసుకుని, మూగ జీవాలను బలిచ్చి, నూతన జంటకు పెద్దకర్మ చేయాలని ఆదేశించారు.

గ్రామ పెద్దల ఆదేశాలతో భయపడిపోయిన యువతి కుటుంబ సభ్యులు, వారి బంధువులు సుమారు 40 మంది పురుషులు గుండు గీయించుకున్నారు. అనంతరం బతికున్న తమ కూతురు, అల్లుడికి పెద్దకర్మ కూడా జరిపించారు. ఈ అమానవీయ ఘటన ఆ గ్రామస్థులతో పాటు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలను సైతం తీవ్రంగా కలచివేసింది. దీనిపై పోలీసులను వివరణ అడగ్గా తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు.

Next Story