శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని వివాదస్పద వ్యాఖ్యలు

by Yella Dhawani Reddy |

పురాణాలు, ఇతిహాసాల ప్రకారం శ్రీరామచంద్రమూర్తి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అయోధ్యలో జన్మించాడని మనకు తెలుసు.

శ్రీరాముడు మా దేశంలోనే జన్మించాడు: నేపాల్ ప్రధాని వివాదస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పురాణాలు, ఇతిహాసాల ప్రకారం శ్రీరామచంద్రమూర్తి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అయోధ్యలో జన్మించాడని మనకు తెలుసు. అయితే, నేపాల్ (Nepal) ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) శ్రీరాముడి జన్మస్థలంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు నేపాల్ భూభాగంలోనే జన్మించారని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. సోమవారం ఖాట్మండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఓలి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని తెలిపారు. ఆయన గతంలోనూ ఈ విధంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 2020లో అయోధ్య తమ దేశంలోని చిత్వాన్‌లోని థోరిలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడే రాముడు పుట్టాడని ఆయన అన్నారు.

ఈ విషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించవద్దని పిలుపునిచ్చారు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరని ప్రశ్నించారు. రాముడు పుట్టిన స్థలం నేపాల్‌లోనే ఉందని, అది ఇప్పటికీ అక్కడే ఉందన్నారు. దీన్ని తాము అంతగా ప్రచారం చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. అంతేకాదు, శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని ఆయన పేర్కొన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని, వాల్మీకి రాసిన రామాయణంలోనే ఇది కూడా ఉందన్నారు. ఇతిహాసాల్లో ప్రస్తావించిన ప్రదేశాలు ఇప్పుడు తమ దేశంలోని సున్‌సారి జిల్లాలోనే ఉన్నాయన్నారు.

Next Story