Lok Sabha: లోక్‌ సభలో 6 కొత్త భాషలకు అనువాద సేవలు.. ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా

by B.Srinivas |

6 కొత్త భాషలకు అనువాద సేవలను అందిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. బోడో, డోగ్రి, మైథిలి, మణిపురి, ఉర్దూలో సేవలను విస్తరింపజేస్తున్నట్టు ప్రకటించారు.

Lok Sabha: లోక్‌ సభలో 6 కొత్త భాషలకు అనువాద సేవలు.. ప్రకటించిన స్పీకర్ ఓం బిర్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభలో 6 కొత్త భాషలకు అనువాద సేవలను అందిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తెలిపారు. బోడో, డోగ్రి, మైథిలి, మణిపురి, ఉర్దూ, సంస్కృతంలలో ఈ సేవలను విస్తరింపజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ భాషలు మాట్లాడే సభ్యుల ప్రాతినిధ్యం పెంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. సభ కార్యకలాపాలను ఏకకాలంలో 22 గుర్తింపు పొందిన భాషలలోకి అనువదించడమే తన ప్రయత్నమన్నారు. దీనికోసం మానవ వనరులు, సాంకేతిక వనరులను పెంచే ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే పార్లమెంటు కార్యకలాపాలను ఒకేసారి అనేక భాషలలోకి అనువదిస్తున్న ఏకైక సంస్థ భారత పార్లమెంటు మాత్రమేనని తెలిపారు. కాగా, ప్రస్తుతం హిందీ (Hindi), ఇంగ్లీష్ (English), అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు (Telugu) భాషల్లో మాత్రమే అనువాద సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఆరు కొత్త భాషలను చేర్చడంతో 16 భాషల్లో సేవలు అందనున్నాయి.

సంస్కృతంపై డీఎంకే అభ్యంతరం

సభా కార్యకలాపాలను సంస్కృత భాషలోకి మార్చాలనే నిర్ణయంపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ (Dayanidhi maran) అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో కేవలం 73 వేల మంది మాత్రమే సంస్కృతం మాట్లాడతారని, ఏకకాలంలో అనువాదం చేయడానికి ప్రజా ధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాల కారణంగా పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథా అవుతోందని విమర్శించారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ భారతదేశ మూల భాష సంస్కృతంమని, మీరు దీనిని వ్యతిరేకించడం సరికాదని తెలిపారు.

Next Story