ముగిసిన బడ్జెట్ సమావేశాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-04 15:38:46  IST  )

రాజ్యసభ 267వ సమావేశాల ముగింపు సభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లులతో సహా కీలక చట్టాలను సభ ఆమోదించిందని చెప్పారు.

ముగిసిన బడ్జెట్ సమావేశాలు
X

- ఉభయ సభలు నిరవధిక వాయిదా

- 16 బిల్లుల ఆమోదం

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. జనవరి 31న ప్రారంభమైన బడ్జెట్ సెషన్‌కు తెరదించుతూ లోక్‌సభ శుక్రవారం వాయిదా పడగా.. రాజ్యసభ కూడా శుక్రవారం మధ్యాహ్నం 1.00 గంటకు వాయిదా పడినట్లు చైర్మన్ ధన్‌కర్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయుల సామూహిక తొలగింపు, నగదు కుంభకోణంపై రాజ్యసభలో తీవ్ర స్థాయిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ వ్యాఖ్యల తర్వాత సభలో గందరగోళం చోటు చేసుకోవడంతో సభను వాయిదా వేశారు. ఇక లోక్‌సభను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ఆమోదించినట్లు స్పీకర్ తెలిపారు. గతంలో కంటే ఈ సారి సభలో 118 శాతం అధిక ఉత్పాదకత లభించినట్లు స్పీకర్ వెల్లడించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు గ్రాంట్ల డిమాండ్లడతో పాటు ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్ బడ్జెట్‌ను కూడా ఆమోదించింది. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన వక్ఫ్ బిల్లును కూడా ఆమోదించారు. ఈ సవరణ చట్టాన్ని ఆమోదించడానికి ఉభయ సభలకు చాలా గంటల సమయం పట్టినట్లు తెలిపారు.

రాజ్యసభ 267వ సమావేశాల ముగింపు సభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లులతో సహా కీలక చట్టాలను సభ ఆమోదించిందని చెప్పారు. ఈ సమావేశాల్లో ముఖ్యమైన అంశాలను కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో వక్ఫ్ బిల్లుపై అర్థ రాత్రి కూడా చర్చ జరిగింది. వక్ఫ్ బిల్లులో లోక్‌సభలో 14 గంటల పాటు చర్చ జరగగా.. రాజ్యసభలో మరుసటి రోజు ఉదయం 4.00 గంటల వరకు చర్చ జరగడం గమనార్హం. రాజ్యసభ చరిత్రలోనే ఇదొక అరుదైన విషయమని చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. సభలో ఇలా చర్చ జరగడం ప్రజలకు గొప్ప సందేశాన్ని పంపుతుందని.. ఇది వ్యవస్థపై గొప్ప నమ్మకాన్ని పెంచుతుందని ధన్‌ఖర్ చెప్పారు.

Next Story