Tamilanadu : లాకప్ డెత్ ఘటన.. సీఎం క్షమాపణలు

by Muthe.Rajitha |

తమిళనాడు(Tamilanadu)లో ఇటీవల జరిగిన ఓ లాకప్ డెత్ కేసు(Lockup Death Case) ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.

Tamilanadu : లాకప్ డెత్ ఘటన.. సీఎం క్షమాపణలు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు(Tamilanadu)లో ఇటీవల జరిగిన ఓ లాకప్ డెత్ కేసు(Lockup Death Case) ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో మరణించిన అజిత్ కుమార్(Ajith Kumar) కుటుంబ సభ్యులకు సీఎం స్టాలిన్(CM MK Stalin) క్షమాపణలు తెలిపారు. అజిత్ తల్లికి స్టాలిన్ ఫోన్ చేసి మాట్లాడారు. జరగకూడని ఘటన జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ధైర్యంగా ఉండాలని అన్నారు. ఇప్పటికే బాధ్యులను అరెస్ట్ చేయించామని, తప్పకుండా శిక్ష పడేలా చూస్తామని, మీ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా అదుకుంటుందని స్టాలిన్ హామీ ఇచ్చారు.

కాగా తమిళనాడులోని సివగంగై జిల్లాలోని మదపురం కాళీ అమ్మన్ ఆలయంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న 27 ఏళ్ల ఆజిత్ కుమార్‌ను ఆలయంలో జరిగిన దొంగతనం కేసులో ప్రశ్నించడానికి తిరుప్పువనం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉండగానే, అజిత్ ఆరోగ్యం క్షీణించిందని, సివగంగైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత మదురైలోని మరో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే అజిత్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపించారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసినప్పటికీ.. మద్రాస్ హైకోర్టు(Madras High Court) బెంచ్ స్వయంగా జోక్యం చేసుకుని సస్పెన్షన్‌ సరిపోదని, కఠిన చర్యలు తీసుకోవాలని మండిపడింది. అలాగే గత నాలుగేళ్లలో 24 లాకప్ మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణాత్మక నివేదిక సమర్పించమని ఆదేశించింది. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చిన స్టాలిన్ ప్రభుత్వం, ఈ కేసును నేడు సీబీఐకి బదిలీ చేసింది. మరోవైపు అజిత్ కుమార్ కుటుంబ సభ్యులకు సీఎం క్షమాపణలు తెలిపారు.

Next Story