ఆప్‌ను నాశనం చేసేందుకు.. మోడీ, షా చేసిన కుట్ర లిక్కర్ స్కాం

by Phanindra |

ఆప్‌ను నాశనం చేసేందుకు మోడీ, షా చేసిన కుట్రే లిక్కర్ స్కాం అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

ఆప్‌ను నాశనం చేసేందుకు.. మోడీ, షా చేసిన కుట్ర లిక్కర్ స్కాం
X

దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కాం కేసులో ట్రయల్ కోర్టు నిర్దోషిగా విడుదల చేయడంపై.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తంచేశారు. తాను నిఖార్సయిన నిజాయితీపరుడిననే విషయం ఇప్పుడు అందరికీ తెలిసొచ్చిందన్నారు. కోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయిన ఆయన.. అనంతరం ఆప్ నేతలు దుర్గేష్ పాఠక్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీకి దమ్ముంటే ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ ఎన్నికల్లో బీజేపీకి పది సీట్లు వచ్చినా తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని సవాల్ విసిరారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కలిసి తనపై ఈ కుట్ర చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. అధికారంపై మోడీ, షాలకు ఉన్న ఆశ వల్ల మూడు కోట్ల మంది ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత సృష్టించిన అతిపెద్ద బూటకం ఈ లిక్కర్ కుంభకోణమన్న కేజ్రీవాల్.. పీఎం మోడీ, షాలు ఆప్ వంటి పార్టీలను నాశనం చేయడంపై కాకుండా దేశాభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చారు. కేవలం అధికారం కోసం ఎవరూ ఇలా రాజ్యాంగంతో ఆటలాడుకోవడం తగదన్నారు. ఈ కేసులో ఏమాత్రం విషయం ఉన్నా.. ఏళ్ల తరబడి విచారణ సాగేదని, కానీ ఏమాత్రం నిజం లేకపోవడం వల్లనే ముగిసిపోయిందని కేజ్రీవాల్ చెప్పారు. ఇది తప్పుడు కేసని కోర్టు కూడా చెప్పిందన్నారు. తమను ఢిల్లీ గద్దె దించేందుకు ఈ కుంభకోణాన్ని సృష్టించిన మోడీ, షాలు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సుమారు 600 పేజీల తీర్పులో.. కేసుకు సరిపోయే ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు కూడా లేవని కోర్టు తేల్చిందన్నారు.

Next Story