భారత సైన్యానికి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ధీరజ్‌ సేథ్‌

by Naga Rani Yarlagadda |

భారత ఆర్మీకి తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ను నియమిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

భారత సైన్యానికి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్‌ జనరల్‌ ధీరజ్‌ సేథ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ఆర్మీకి తదుపరి సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా ఉన్న జనరల్ ఉపేంద్ర ద్వివేది త్వరలోనే రిటైర్మెంట్ తీసుకోనున్నారు. ఆయన రిటైర్మెంట్ అనంతరం.. జూన్ 30న లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నూతన ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారని కేంద్రం ఆ ప్రకటనలో వివరించింది. ధీరజ్ సేథ్ ప్రస్తుతం భారత సైన్యానికి వైస్ చీఫ్ గా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1నే ఆయన వైస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు.

ధీరజ్ సేథ్ ట్రాక్ రికార్డ్ ఇదే..

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ఖడక్వాస్లా పూర్వ విద్యార్థి అయిన లెఫ్టినెంట్ జనరల్ సేథ్.. 1986 డిసెంబర్ లో ఆర్మర్డ్ కోర్సులో చేరారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన సైన్యంలో విశేష సేవలందించారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలతో పాటు.. క్లిస్టమైన యుద్ధవాతావరణాల్లో విస్తృతమైన కార్యాచరణ అనుభవాన్ని గడించారు. ఎడారి ప్రాంతంలో ఆర్మర్డ్ రెజిమెంట్ కు, మైదాన ప్రాంతంలో ఆర్మర్డ్ బ్రిగేడ్ కు, జమ్మూకశ్మీర్లో కౌంటర్ -ఇన్సర్జెన్సీ దళానికి కమాండర్ గా వ్యవహరించారు.

లెఫ్టినెంట్ జనరల్ గా పదోన్నతి పొందిన తర్వాత సుదర్శన్ చక్ర కార్ప్స్ కు కమాండర్ గా సేవలందించారు. ఆ తర్వాత ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండర్ గా సేవలందింస్తూనే.. కీలక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం సౌత్ వెస్ట్రన్ కమాండ్, సదరన్ కమాండ్ లకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా పనిచేసి.. సైన్యంలో కీలక ఆపరేషనల్ కమాండ్లకు నాయకత్వం వహించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్లోని ఇండిపెండెంట్ ఆర్మర్డ్ బ్రిగేడ్ కు బ్రిగేడ్ మేజర్ గా, అంగోలాలో ఐక్యరాజ్యసమితి మిషన్ ఆపరేషన్స్ ఆఫీసర్ గా, ఆర్మీ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ మిలిటరీ సెక్రటరీగా, సౌత్ వెస్ట్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ లో బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్ గా, డైరెక్టర్ జనరల్ డిసిప్లిన్, సెరిమోనియర్ అండ్ వెల్ఫేర్ గా పనిచేశారు. అంతేకాదు.. కల్నల్ కేపబిలిటీ డెవలప్‌మెంట్ (మెకనైజ్డ్ ఫోర్సెస్), బ్రిగేడియర్ పర్స్పెక్టివ్ ప్లాన్స్ అండ్ అక్విజిషన్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ కేపబిలిటీ డెవలప్‌మెంట్ వంటి కీలక పదవులను ఆయన నిర్వహించారు. విద్యాపరంగానూ లెఫ్టినెంట్ జనరల్ సేథ్ కు మంచి రికార్డే ఉంది. జూనియర్ కమాండ్ కోర్సులో ఆయన ప్రథమ స్థానంలో నిలిచారు. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో 'బెస్ట్ ఆల్-రౌండ్ స్టూడెంట్ ఆఫీసర్ మెడల్' సాధించారు. హయ్యర్ కమాండ్ కోర్స్, ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన ఆయన, పారిస్‌లో కమాండ్ అండ్ స్టాఫ్ కోర్సును కూడా పూర్తి చేశారు.

Next Story