Pahalgam attack: పాకిస్థాన్‌లో పహెల్గాం ఉగ్రదాడి మాస్టర్‌ మైండ్‌ ర్యాలీ

by Shamantha N |   (  Updated:2025-05-29 08:15:50  IST  )

పహెల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా(LeT) కమాండర్ సైఫుల్లా కసూరి బహిరంగ ర్యాలీలో ప్రత్యక్షమయ్యాడు. పాకిస్థాన్ రాజకీయ నాయకులు, వాంటెడ్ టెర్రరిస్టులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నాడు

Pahalgam attack: పాకిస్థాన్‌లో పహెల్గాం ఉగ్రదాడి మాస్టర్‌ మైండ్‌ ర్యాలీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గామ్ ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా(LeT) కమాండర్ సైఫుల్లా కసూరి బహిరంగ ర్యాలీలో ప్రత్యక్షమయ్యాడు. పాకిస్థాన్ రాజకీయ నాయకులు, వాంటెడ్ టెర్రరిస్టులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నాడు. అణు పరీక్షల వార్షిక స్మారక దినోత్సవం అయిన యూమ్-ఎ-తక్బీర్‌ను పురస్కరించుకుని పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (PMML) నిర్వహించిన ఈ ర్యాలీలో భారత్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. "పహెల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారి అని నన్ను నిందించారు. ఇప్పుడు నా పేరు మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది" అని అన్నారు. అంతేకాకుండా, అలహాబాద్ లో "ముదస్సిర్ షహీద్" పేరుతో ఒక కేంద్రం, రోడ్డు మరియు ఆసుపత్రిని నిర్మించే ప్రణాళికలను ప్రకటించాడు. కాగా.. ఆపరేషన్ సిందూర్ దాడుల్లో చనిపోయిన అనేక మంది హై ప్రొఫైల్ ఉగ్రకార్యకర్తల్లో ముదస్సిర్ అహ్మద్ ఒకరు. మరోవైపు, ఎల్‌ఈటీ వ్యవస్థాపకుడు, వాండెట్ టెర్రరిస్టు, హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం.

పహెల్గామ్ కీలక సూత్రధారి

జమ్మూకశ్మీర్‌లో పహెల్గామ్ (Pahalgam)లో ఉగ్రదాడి వెనుక పాక్‌ లష్కరే (ఎల్‌ఈటీ) కమాండర్‌ ఖలీద్‌ పేరు బయటకు వచ్చింది. కాగా.. పాక్‌కు చెందిన లష్కరే సంస్థలో ఖలీద్‌ చాలా కీలక వ్యక్తి. అతడి అసలు పేరు సైఫుల్లా కసూరి. లష్కరే చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా, ప్రస్తుతం లష్కరే పెషావర్‌ ప్రధాన కార్యాలయానికి అధిపతి. అతడిని మిల్లీ ముస్లింలీగ్‌ సంస్థకు అధ్యక్షుడిగా కూడా చెబుతుంటారు. ఇది హఫీజ్‌ సయీద్‌కు చెందిన జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ)కు రాజకీయ విభాగం. ఈ జమాత్‌ విభాగం పంజాబ్‌ ప్రావిన్స్‌ సమన్వయ విభాగం కూడా ఇతడే చూస్తున్నాడు. ప్రస్తుతం జేయూడీని అమెరికా విదేశాంగశాఖ లష్కరే అనుబంధ సంస్థగా గుర్తించి.. ఉగ్ర ముద్ర వేసింది. ఇకపోతే, ఏప్రిల్ 22న పహెల్గాంలో అమాయకులైన టూరిస్టులపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను నేలకూల్చింది. ఆ తర్వాత ఉద్రిక్తతలు తీవ్రతరంగా మారాయి.

Next Story