నిర్ణయం ప్రకటించడానికి సిద్ధమైన సీపీఐ, సీపీఎం: తమిళ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ

by Gantepaka Srikanth |

తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది.

నిర్ణయం ప్రకటించడానికి సిద్ధమైన సీపీఐ, సీపీఎం: తమిళ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ క్రమంలో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 'మ్యాజిక్ ఫిగర్' (118) కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. విజయ్ పార్టీకి ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతు ప్రకటించగా, ఇప్పుడు అందరి కళ్లు సీపీఐ (CPI), సీపీఎం (CPM) వైపు మళ్లాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఈ రెండు పార్టీల మద్దతు అత్యంత కీలకంగా మారింది. విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై సీపీఐ, సీపీఎం అగ్రనేతలు ఇప్పటికే తమ తమ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

కీలక భేటీ..

నేడు జరగనున్న పార్టీ అంతర్గత సమావేశాల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెజారిటీ సభ్యులు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారా లేదా అనేది సాయంత్రం లోపు స్పష్టత రానుంది. గత కొన్నేళ్లుగా డీఎంకే (DMK) కూటమిలో కొనసాగుతున్న వామపక్షాలు, ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పక్షాన నిలుస్తాయా? లేక తటస్థంగా ఉంటాయా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. "ప్రజాతీర్పును గౌరవించి, అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి" అని ఇప్పటికే కొందరు వామపక్ష నేతలు గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం గమనార్హం. మరోవైపు, సీపీఐ, సీపీఎం మద్దతు లభిస్తే విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం దాదాపు ఖాయమవుతుంది. లేనిపక్షంలో తమిళనాట రాజకీయ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఏదేమైనా, లెఫ్ట్ పార్టీలు తీసుకోబోయే ఈ నిర్ణయం తమిళ రాజకీయ చరిత్రలో సరికొత్త మలుపు కానుంది.

Next Story