నడిరోడ్డుపై లాయర్‌ను కాల్చి చంపిన దుండగులు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-13 15:01:39  IST  )

బీహార్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి.

నడిరోడ్డుపై లాయర్‌ను కాల్చి చంపిన దుండగులు
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్‌లో (Bihar) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పాట్నా వ్యాపారి గోపాల్ ఖేమ్కాను అగంతకులు కాల్చిచంపిన ఘటన మరువక ముందే మరో దారుణ హత్య చోటుచేసుకుంది. ఆదివారం (జులై 13) పట్టపగలే సుల్తాన్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు కేవలం 300 మీటర్ల దూరంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. జితేందర్ కుమార్ అనే లాయర్‌పై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి (Lawyer shot dead) చెందాడు. దీంతో ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.

జితేందర్ కుమార్‌ రెగ్యులర్‌గా వచ్చే టీ షాపులో టీ తాగి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారైనట్టు పాట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు. లాయర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్టు చెప్పారు. ఘటనా స్థలి నుంచి మూడు ఖాళీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోంచి విచారణ చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా హంతకులను పట్టుకుంటామని అన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న బీహార్‌లో గత 24 గంటల్లో కాల్పుల సంఘటనల్లో నలుగురు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Next Story