- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ShaShi Tharoor: భారత చరిత్రలో ఎమర్జెన్సీని ఒక పాఠంగా అర్థం చేసుకోవాలి: శశి థరూర్
క్రమశిక్షణ కోసం తీసుకున్న అప్పటి చర్యలు సమర్థించలేని క్రూరమైన చర్యలుగా మారాయని అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత చరిత్రలో ఎమర్జెన్సీ కాలాన్ని కేవలం ఒక చీకటి అధ్యాయంగా గుర్తుంచుకోకూడదని, దాన్నొక పాఠంగా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ అన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన ఓ మలయాల పత్రికకు వ్యాసం రాశారు. అందులో పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆ సమయంలో సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ బలవంతంగా కుటుంబ నియంత్రణా ఆపరేషన్లను ఎవరూ మర్చిపోలేరని తెలిపారు. 1975 జూన్ 25 నుంచి 1977, మార్చి 21 వరకు సుమారు రెండేళ్లు దేశంలో ఎమర్జెన్సీ అమలైంది. క్రమశిక్షణ కోసం తీసుకున్న అప్పటి చర్యలు సమర్థించలేని క్రూరమైన చర్యలుగా మారాయని అన్నారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ పేద గ్రామీణ ప్రాంతాల్లో వ్యాసెక్టమీ క్యాంపెయిన్ల్లు జరిపి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల హింస నిరంకుశత్వంగా మారింది. న్యూఢిల్లీ వంటి నగరాల్లో, మురికివాడలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి తొలగించారు. వేలాది మందిని నిరాశ్రయులను చేశారు. వారి సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. క్రమంగా ఆ పరిస్థితులు దురదృష్టకరమని అనుకున్నప్పటికీ, ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఆ దారుణాలను ఎవరూ మర్చిపోలేరని శశి థరూర్ తన వ్యాసంలో వెల్లడించారు.
ప్రజాస్వామ్యాన్ని తేలికగా తీసుకోవలసినది కాదని, ఇది నిరంతరం పెంపొందించుకోవాల్సిన, సంరక్షించాల్సిన విలువైన వారసత్వమని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ కాలం ఇప్పటి భారత్‌లా లేదు. ప్రస్తుతం మనదేశం స్వావలంబనతో ముందుకెళ్తున్నాం. పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కానీ, ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులను లెక్కజేయకుండా, భావ ప్రకటనా స్వేచ్ఛను కట్టడి చేశారు. అవన్నీ దేశ రాజకీయాల్లో మాయని మచ్చగా మిగిలిపోయాయి. కాబట్టి అప్పటి ఎమర్జెన్సీ పరిస్థితులను చీకటి అధ్యాయంగా మాత్రమే గుర్తు పెట్టుకోకూడదని, వాటి నుంచి పాఠాలను నేర్చుకుని ప్రజాస్వామ్యన్ని రక్షించుకోవాలని పేర్కొన్నారు.






