Tej Pratap: తేజ్ ప్రతాప్ యాదవ్ పై వేటు.. ఆర్జేడీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరణ

by Shamantha N |

బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ పై రాష్ట్రీయ జనతాదళ్ (RJD) వేటు వేసింది.

Tej Pratap: తేజ్ ప్రతాప్ యాదవ్ పై వేటు.. ఆర్జేడీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ పై రాష్ట్రీయ జనతాదళ్ (RJD) వేటు వేసింది. తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ (Tej Pratap Yadav)ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో హిందీలో పోస్టు పెట్టారు. "వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా చేస్తున్న చర్యలు.. సామాజిక న్యాయం కోసం మన సమిష్టి పోరాటాన్ని బలహీనపరుస్తుంది. పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. ఈ పరిస్థితుల కారణంగా, నేను అతన్ని పార్టీ నుంచి కుటుంబం నుండి తొలగిస్తున్నాను. ఇక నుంచి అతనికి పార్టీలో, కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదు. అతన్ని 6 సంవత్సరాలు పార్టీ నుండి బహిష్కరిస్తున్నాను" అని లాలూ సోషల్ మీడియా పోస్టులో అన్నారు. శనివారం తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో లాలూ ప్రసాద్‌ ఈ చర్యలు తీసుకున్నారు. అయితే, ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని తేజ్ ప్రతాప్ వివరణ ఇచ్చుకున్నప్పటికీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

ఎన్నికల స్టంట్..

లాలూ యాదవ్ చిన్న కుమారుడు, తేజ్ ప్రతాప్ సోదరుడు తేజస్వి యాదవ్ ఆదివారం పాట్నాలో మీడియాతో మాట్లాడారు. తేజ్ ప్రతాప్ బహిష్కరణపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రతి ఒకరు తమ రాజకీయ, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా ఉంచుకోవాలని అన్నారు. తేజస్వి మాట్లాడుతూ.. "నా విషయానికొస్తే నేను ఇవన్నీ ఇష్టపడను లేదా సహించను. వ్యక్తిగత జీవితం వేరుగా ఉండాలి. ఆయన పెద్దవాడు, తన సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు ఉంది. అంతేకాకుడా, లాలూ జీ కూడా ట్వీట్ ద్వారా తన ఆలోచనలను స్పష్టం చేశారు. ఆయన సరైనది అనుకున్నది చేశారు. మీడియా ద్వారా మాత్రమే నాకు ఈ విషయం తెలిసింది" అని అన్నారు. మరోవైపు, నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) మాత్రం ఈ పరిణామాలను ఎన్నికల స్టంట్ అని కొట్టిపారేసింది. "లాలూ జీ తప్పుదారి పట్టిస్తున్నారు. లాలూ కుటుంబం ఐశ్వర్య (తేజ్ ప్రతాప్ యాదవ్ మాజీ భార్య) పై ఘోరమైన పాపం చేసినప్పుడు ఆయన మనస్సాక్షి ఎందుకు స్పందించలేదు. ఇది అనైతికత. ఎన్నికల సమయంలో ఆయన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఎన్నికల తర్వాత తేజ్ ప్రతాప్‌ను తిరిగి పార్టీలోకి తీసుకుంటారు" అని జేడీయు జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ అన్నారు.

Next Story